వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)ని పురష్కరించుకుని మండలంలోని పలు దేవాలయాల్లో భక్తులు సోమవారం తెల్లవారు జాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొద్దికూరపాడులో శ్రీదేవి, భూదేవి సమేత మాధవ స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసారు. స్వామి వార్లను సర్వాంగసుందరంగా అలంకరించి గరుక్మంతుని వాహనంపై గ్రామ వీధులలో మేళ తాలాలతో ఊరేగింపు జరిపారు. ఉత్సవం వెంట మహిళా భక్తులు హరేరామ సంకీర్తన చేస్తూ వెంట రాగా భక్తి పారవస్యం వెల్లివిరిసింది. ఆచారం ప్రకారం రాచపూడి కోటేశ్వరరావు బ్రదర్స్( పూర్వపు కరణం ) ఆధ్వర్యంలో, సుబ్రహ్మణ్యం, శంకరశాస్త్రి , రమణయ్య పూజారుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది.గ్రామోత్సవం నిర్వహించారు. తూర్పుగంగవరం కోదండ రామస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు సీతారామ దీక్షుతులు, శ్రీనివాస దీక్షితులు, హనుమత్ ప్రసాద్ దీక్షితుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాముల వారి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని నర్విహించారు. పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు.


