నేల ఆరోగ్యంపైనే పంట ఆరోగ్యం ఆధార పడి ఉంటుందని జిల్లా ఆత్మ పీడీ, జిల్లా వనరుల కేంద్రం సమన్వయ కర్త కె. అన్నపూర్ణ అన్నారు. తాళ్లూరు ఆర్బికేలో శనివారం రైతులకు పంట సాగుకు ఉపయోగించాల్సిన ఎరువుల మోతాదుపై శిక్షణా కార్యక్రమం వ్యవసాయాధికారి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఆత్మ పీడీ, జిల్లా వనరుల కేంద్రం సమన్వయ కర్త కె. అన్నపూర్ణ మాట్లాడుతూ రైతులు అవసరమైన మేర ఎరువులు, పురుగు మందుల వాడాలని అతిగా అధికంగా వాడినట్లయితే దిగుబడులు సైతం తగ్గుతాయని చెప్పారు. పెట్టుబడి పెరిగి, దిగుబడులు తగ్గినట్లయితే రైతులు నష్టపోవలసి వస్తుందని చెప్పారు. సేంద్రీయ, జీవన, పచ్చి రొట్ట ఎరువుల వాడకాన్ని పెంచి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అద్దంకి ఎడీఏ కె. ధనరాజ్, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి శేషమ్మ శనగ, ప్రత్తి, మిరప పంటలలో సాగు యాజమాన్యం గురించి, పంటల ఈ – క్రాప్ నమోదు, పంట నష్టపరిహారం అందించటంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయా పంటలను పరిశీలించారు.
