ప్రభుత్వంపై దుష్టచతుష్టయం చేస్తున్న విష ప్రచారాన్ని రాబోయే ఎన్నికల్లో తిప్పి కొట్టి ఇంటికి సాగనంపాలని టిటిడి ఛైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా మాయమాటలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలు నమ్మితే పేద ప్రజలు మోసపోయి పథకాలకు దూరమైపోతారన్నారు. పాయకరావుపేటలో జరిగిన ఆ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష కుట్రలను తెలియజేసేందుకు, వలంటీర్ వ్యవస్థకు సమాంతరంగా పార్టీ వ్యవస్థకు రూపకల్పన చేశామని తెలియజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని వివరించాలన్నారు. పార్టీలో మనస్పర్థలను పక్కన పెట్టి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే గొల్ల బాబూరావును గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ పరంగా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి రావాలన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ ను రాబోయే ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ బి. సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, చెంగల వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ డివీ సూర్యనారాయణరాజు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


