జగనన్న పాల వెల్లువ విజయవంతానికి గ్రామ స్థాయిలో పొదుపు సంఘ | సభ్యులు, కమిటీ సభ్యులు, వలంటీర్లు, గ్రామకార్యదర్శులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచెయ్యాలని జిల్లా కోఆపరేటివ్ శాఖ అధికారి (డిసీఓ) రాజశేఖర్ కోరారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం పొదుపు సంఘ సభ్యులతో పాటు ఇతర శాఖల అధికారులకు పాల వెల్లువ విజయవంతంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీఓ రాజశేఖర్ మాట్లాడుతూ . జగనన్నపాల వెల్లువ పథకం ఏర్పాటులో పాడి రైతులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. పథకం ప్రాముఖ్యతను పాడి రైతులకు వివరించి పథకంను విజయవంతం చెయ్యాలని కోరారు. జిల్లా మార్కేటింగ్ డిడి, మండల ప్రత్యేక అధికారి ఉపేంద్రకుమార్ మాట్లాడుతూ గ్రామకార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వలంటీర్లతో మాట్లాడి వారితో పాటు వారి పరిధిలో ఉన్న పాడి రైతు లబ్ధిదారులచే పాలను సేకరించే విధంగా ప్రయత్నం చెయ్యాలని సూచించారు. అమూల్య డైరీ రాకతో పాడి రైతులకు మరింత మద్దతు ధర లభించిందని చెప్పారు. మండలంలో 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా మూడు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేయటానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని కోరారు. అందుకు చేయవలసిన కృషిని ఎంపీడీఓ కెవై కీర్తి, ఎపీడిడిసీఎఫ్ రాజమోహన్, ఎపీఓ దేవరాజ్, ఈఓఆర్డీ ప్రసన్నకుమార్, పశువైద్యాధికారులు ప్రతాపకుమార్, రాంబాబు, డీఈసీ డాక్టర్ భరత్, అమూల్ ప్రతినిథి షేక్ బాల్జిలు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న లోపాలను, విజయవంతానికి పాటించాల్సిన విధానాలను విఏఏలు, పశువైద్యసహాయకులు, సీసీలు సభ దృష్టికి తీసుకురాగా, పలు రకాలు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
