బాలికల అభ్యున్నతికి ప్రభుత్వం మరింత చేయూత అందిస్తున్నదని, సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలను స్త్రీ శిశు సంక్షేమశాఖ, ఐసీడీఎస్, వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కెవై కీర్తి తెలిపారు. తాళ్లూరు కేజీబీవీలో మంగళవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ జి సబ్బయ్య మాట్లాడుతూ బాలికలకు విద్య యొక్క ఆవశ్యకతను తెలిపారు. విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానంలో నిలవటానికి సాధ్యమని చెప్పారు. నేడు ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ఇస్తున్న ప్రాముఖ్యతను వివరించారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి మాట్లాడుతూ….గ్రామాలలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలలో అవగాహన పెంచటంతో పాటు అసమానత్వం, విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు. వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్యవివాహాలపై చైతన్య కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం కూడ దిశ చట్టం తీసుకురావటంతో మహిళలలో మరింత ఆత్మస్థెర్యం పెరిగిందని అన్నారు. అనంతరం ఆడపిల్లను రక్షిద్దాం-ఆడపిల్లను చదివిద్దాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుజిత, సూపర్వైజర్ జ్యోతి, సునీత, సీహెచ్ ప్రమీల, హెచ్ఓ కొప్పోలు శ్రీనివాసరావు, కేజీబీవీ, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెలుగువారిపాలెం ఎంపీపీఎస్ (ఎస్సీ విఆర్) లో ప్రధానోపాధ్యాయుడు పొలం రెడ్డి సుబ్బా * రెడ్డి ఆధ్వర్యంలో బాలికాదినోత్సవంను ఘనంగా నిర్వహించారు. బాలికల ప్రాముఖ్యతను వివరించారు.

