నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని ఇవాళ(సోమవారం) జిల్లాలోని వినుకొండలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ..
”వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో నవరత్నాలులోని ప్రతీ పథకాన్ని, సంక్షేమ పథకాల్లోని ప్రతీ పథకాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతీ వర్గాల కుటుంబాలకు మేలు చేసేలా మన అందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో భాగంగా.. సొంత షాప్ ఉన్న రజక సోదరుడికి, నాయీబ్రాహ్మణుడికి, దర్జీ అక్కాచెల్లెలకు ఏటా పది వేల రూపాయల ఆర్థిక సాయం చేసేలా జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చాం.
లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. వివక్ష లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నాం. వరుసగా ఈ మూడేళ్లలో అక్షరాల మూడు లక్షల ముప్పై వేల మందికి మంచి చేస్తూ.. నేడు రూ. 330 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మొత్తంగా.. జగనన్న చేదోడు కార్యక్రమంతో రూ. 927 కోట్లు జమ చేసినట్లు అవుతుందని తెలిపారు.