ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామానికి చెందిన పోకూరి లక్ష్మి(28) అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ గురువారం తెలిపారు. మారెళ్ళ గ్రామానికి చెందిన పోకూరి ప్రభుకు కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన లక్ష్మితో 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం కలరు. రెండు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలతో గొడవ పడుతున్నారు. తిరుపతి జిల్లా తడ పట్టణంలోని శ్రీ సిటీకి బేల్దారి పనుల నిమిత్తం కూలి పనులకు వెళ్లారు. ఈ నెల నాలుగవ తేదీన ఇద్దరి మధ్య గొడవ పడగా మనస్థాపం చెందిన లక్ష్మీ తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందింది. దీంతో భర్త ప్రభు ఉదయాన్నే తన స్వగ్రామమైన మారెళ్ళకు తీసుకువెళ్లారు. లక్ష్మీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా గురువారం మారెళ్ళకు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. లక్ష్మీ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్ష్మీ మృతి పట్ల తండ్రి చిన్న వీరన్న అనుమానం వ్యక్తం చేయడంతో ఎస్ఐ గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
