గత రెండు రోజుల నుండి వాతావరణం లో భిన్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నా యని ప్రజలు చర్చించుకుంటున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో తీవ్రమైన మంచు కురుస్తుండడంతో రహదారులన్నీ మంచుతో కప్పేయడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. దర్శి అద్దంకి ప్రధాన రహదారి తో పాటు, తాళ్లూరు వినుకొండ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూలుకు వెళ్లే విద్యార్థులు, పొలం వెళ్లే వ్యవసాయ రైతులు, పనులకు వెళ్లే కార్మికులు పలు రకాల ఇబ్బందులు పడ్డారు.12 గంటల నుండి తీవ్రమైన ఎండ ఉండడంతో ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతలకు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు వడగాళ్లు వీస్తుండడంతో ఇండ్లలోంచి బయటకు రాలేకపోయారు. గ్రామంలోని వీధులు, రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. ఎన్నడు లేని విధంగా విచిత్రమైన వాతావరణంతో కాలం ఉందని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.
