జిల్లా ప్రజల తాత్కాలిక అవసరాలు తీర్చడంతోపాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి సమావేశం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో జరిగింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ జిల్లా కలెక్టర్ శ్రీ ఎ.ఎస్. దినేష్ కుమార్. జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్, పి.డి.సి.సి. బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత స్థితిగతులపై ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పారు. ముఖ్యంగా ఈ వేసవిలో త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలుగకూడదన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. నిధుల సమస్య ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. గడపగడపకూ కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. “పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున ఇసుక విషయంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చూడాలన్నారు. స్థానిక బాగుల నుంచి ఇళ్ల అవసరాల కోసం తీసుకెళ్తున్న ఇసుకను కె.పి. సంస్థ ప్రతినిధులు అడ్డుకుని ఇబ్బందులు కల్పిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారని, ఈ విషయంలో కె.పి. ప్రతినిధులకు నిర్థిష్ట ఆదేశాలు ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.
నూతన జవసత్వాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓ. అండ్ ఎం. పనులను నిర్లక్ష్యంగా చేసేవారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనకు రావలసిన నీటి వాటాను తీసుకుని సి.పి.డబ్ల్యు. పధకాలకు నింపే విషయంలో ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా అధికారులు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. నాటుసారా తయారీని అడ్డుకునే క్రమంలో అమాయక గిరిజనులను ఇబ్బందులు పెట్టకుండా క్షేత్రస్థాయి విషయాల పట్ల ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులవుతున్న అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేసేలా అధికారులు మానవతా దృక్పధంతో వ్యవహరించాలని మంత్రి సురేష్ అన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ .. ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలు. లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ .. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కూడా పనిచేసి జిల్లాను ముందుకు నడిపించాలని అన్నారు.
ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా చర్యలు తీసుకొని
జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పధంలో నడిపించాలని అన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలోని సమస్యలను ప్రస్తావించారు.
వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
టి.జె.ఆర్.సుధాకర్ బాబు (సంతనూతలపాడు) : పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా | సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేర్నమిట్టలో అర్హులుగా గుర్తించిన 3 వేల మంది కి ఒంగోలు మండల పరిధిలో స్థలాలు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారని, అలాకాకుండా పేర్నమిట్టలోనే స్థలం చూసి పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు. చీమకుర్తి, తదితర చోట్ల లెవలింగ్ పనులకు బిల్లుల చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సేల్స్ మెన్లు, వాచ్ మెన్లు అక్రమంగా ప్రభుత్వ మద్యాన్ని బయటకు తీసుకువస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వాస్తవ పరిస్థితిని పరిశీలించి మద్యం అక్రమ అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. చీమకుర్తిలోని మూడవ వార్డులో రద్దీగా ఉండే ప్రదేశంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఉందని, దీని వలన ఆ ప్రదేశం గుండా వెళ్తున్న మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. ఉప్పుగుండూరులో జనాభా ఎక్కువగా ఉన్నందున స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒంగోలు-పొదిలి రహదారిని 4 లైన్లుగా విస్తరించాలని అధికారులను కోరారు.
దీనిపై మంత్రి నాగార్జున స్పందిస్తూ.. .. మద్యం దుకాణం తొలగింపు విషయాన్ని కలెక్టర్ దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కాగా, ఒంగోలు-పొదిలి రోడ్డు. నాలుగు లైన్లుగా విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసామని ఆర్ అండ్ బి. అధికారులు తెలిపారు.
డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్, ఎమ్మెల్యే (దర్శి) : కురిచేడులోని ఫిల్టర్బైడ్ సరిగా లేకపోవడంతో నీటి సరఫరాలో తరచూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. పైపు లైన్లు పగిలిపోవడం, మోటారు రిపేర్లు వంటి సమస్యలు వస్తున్నాయన్నారు. ఓ.టి.ఎస్. క్రింద డబ్బులు కట్టిన తమకు ఇప్పటికీ పట్టాలు రాలేదని “గడపగడపకూ” కార్యక్రమంలో కొందరు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అమృత్ పథకంలో మంజూరైన పనులను చేపట్టడానికి అధికారులు త్వరగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేలా చూడాలని కలెక్టరు విజ్ఞప్తి చేశారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నీటి సరఫరాలో ఎదురయ్యే చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకోవడానికి రూ.25 లక్షల జడ్పీ డబ్బులతో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ప్రైవేటు, అభ్యంతరకర భూములలో ఇళ్లు నిర్మించుకుని ఓ.టి.ఎస్. డబ్బులు కట్టిన వారిని పట్టా పొందేందుకు అనర్హులుగా పేర్కొంటూ ఆ డబ్బులను తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాగా, మే రెండో వారం నాటికి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ. చెప్పారు.
కె.నాగార్జున రెడ్డి , ఎమ్మెల్యే, (మార్కాపురం) : ప్రజలకు, పశువులకు నీటి అవసరాలను తీర్చేలా ఆర్.డబ్ల్యు.ఎస్., పశుసంవర్థక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని నాగార్జున రెడ్డి కోరారు. ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేసిన వారికి బిల్లులను త్వరగా క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జిల్లాలోనే కనీసం 25 శాతం విక్రయాలు జరిగేలా అవకాశం కల్పించాలని కోరారు. జగనన్న కాలనీలలో కాకుండా స్వంత స్థలాలలో హౌసింగ్ పథకం క్రింద ఇళ్లు నిర్మించుకునే వారికి బేస్మెంట్ కోసం గ్రావెల్ లభ్యత కష్టంగా ఉందన్నారు. కొనకనమిట్ల, మార్కాపురంలలో జాతీయ రహదారిపై వీధిలైట్లు సరిగా పనిచేయడంలేదని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో 500-600 మంది సామర్థ్యం కలిగిన కమ్యూనిటీ హాళ్లను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తే పంచాయతీలకు ఆదాయం కూడా వస్తుందని సూచించారు.
దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ బేస్మెంట్లకు అవసరమైన గ్రావెల్ లభ్యత విషయంలో హౌసింగ్, మైనింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. త్రాగునీటి విషయంలో కొరత లేకుండా సరఫరా చేయడానికి ప్రైవేటు బోర్లను కూడా గుర్తించామన్నారు. ట్యాంకర్ల నిర్వాహకులకు బిల్లులను సాధ్యమైనంత త్వరగా చెల్లించేలా ప్రభుత్వానికి డి.ఓ. లెటర్ కూడా రాసామన్నారు.
మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్యే (కనిగిరి) : కనిగిరికి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
బుర్రా మధుసూదన్ యాదవ్ (కనిగిరి) కనిగిరికి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. త్రవ్విన రోడ్లలో త్వరగా మరమ్మతు, నిర్మాణ పనులు చేపట్టేలా చూడాలని చెప్పారు. కనిగిరిలో ఆసుపత్రి సామర్థ్యాన్ని 100 పడకలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెలిగండ్ల మండలంలో పాలేటి పాలెం బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పనులు పూర్తి కాకపోవడం వలన వలన వర్షాకాలంలో సుమారు పది గ్రామాలకు రాకపోకలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. బాక్ లలో ప్రభుత్వ మద్యం ఉంటోంది గానీ, ప్రభుత్వ మద్యం దుకాణాలలో లభించడం లేదని, దీనికి కారణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
దీనిపై అధికారులు స్పందిస్తూ పాలేటిపాలెం బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేలా పర్యవేక్షిస్తామన్నారు. మద్యం విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సెబ్ అధికారులను మంత్రి నాగార్జున ఆదేశించారు.
అన్నా రాంబాబు , ఎమ్మెల్యే (గిద్దలూరు) : గిద్దలూరు త్రాగునీటి సమస్య పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. గిద్దలూరుకు నీళ్ల కోసం గొట్టిపడియ వద్ద మోటార్లు బిగించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించాలని మంత్రి సురేషన్‌ను కోరారు. ఈ దిశగా ముందుగానే దృష్టి సారించకపోతే వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి అయినా పక్కనే ఉన్న గిద్దలూరుకు దాహార్తి తీరదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెలగలపాయ, పాపినేనిపల్లికి త్రాగునీరు కోసం ఇన్డెక్వెల్ కావాలని చెప్పారు. కొమరోలు, చేస్తవారిపేట పరిధిలోని అటవీ ప్రాంతాన్ని ఒంగోలు డివిజన్ లో కలపడం సరికాదని ఆయన అన్నారు.
దీనిపై అధికారులు మాట్లాడుతూ గొట్టిపడియ వద్ద మోటార్లు బిగించేలా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ వచ్చే 30 ఏళ్లపాటు గిద్దలూరు నీటి అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. డి.ఎఫ్.ఓ. మాట్లాడుతూ వన్యప్రాణులు మరియు ఎర్రచందనంతో కూడిన ఇతర అటవీ ప్రాంతాన్ని వేరు చేసేలా డివిజన్ లను ప్రభుత్వం మార్చడంతోనే కొమరోలు, బేస్తవారిపేట పరిధిలోని కొంత ప్రాంతాన్ని ఒంగోలు డివిజన్ లో కలపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు..
వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ సరళావందనం మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వలన 7,222 నిర్వాసిత కుటుంబాలను గుర్తించామన్నారు. వీటిలో 4,317 కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ని కలెక్టర్ ఆమోదించినట్లు ఆమె తెలిపారు. మిగతా వాటిలోనూ 1868 కుటుంబాలకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు చెప్పారు. వీటికి కూడా ఆర్ అండ్ ఆర్ అవార్డులు ఖరారు చేయబోతున్నట్లు వివరించారు. కాగా, మంత్రి సురేష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
వ్యవసాయ, గృహ నిర్మాణ, ఉపాధి హామీ, విద్య, వైద్య ఆరోగ్య శాఖలపైనా మంత్రులు, శాసనసభ్యులు చర్చించి జిల్లా అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కె. శ్రీనివాసులు, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సేతు మాధవన్, డి.ఆర్.ఓ. శ్రీమతి ఆర్.శ్రీలత, ఒంగోలు ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, కనిగిరి ఆర్.డి.ఓ. అజయ్ కుమార్. వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
