పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు తయారీలో వ్యవసాయ శాఖ నిమగ్నమై ఉందని మండల వ్యవసాయ అధికారి బి.ప్రసాద్ రావు అన్నారు. ఇటీవల రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు నష్టపోయిన పంటలను పరిశీలించడానికి మంగళవారం ఆయన క్షేత్ర పర్యటన నిర్వహించారు. వ్యవసాయ అధికారి ప్రసాదావు నాగంబొట్లవారి పాలెం,
రామభద్రాపురం, వెలుగువారిపాలెం, అయ్యలపాలెం, రెడ్డినగర్, తూర్పు గంగవరం గ్రామాలలో పర్యటించారు. ఆయా గ్రామాలలో అకాల వర్షాలకు నష్టపోయిన నువ్వుల పంట, ప్రత్తి, గుమ్మడి, అరటి, జామ, కరివేపాకు తదితర పంటలను పరిశీలించారు. ప్రాథమిక సమాచారాన్ని ప్రభు త్వానికి అందజేయడం జరుగుతుందని, తదుపరి ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాల మేరకు పంట నష్టపరిహారాన్ని అంచనా వేయడం జరుగుతుందని ఆయన సూచించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు డి శ్రీను, రైతులు పాల్గొన్నారు.

