రైతులు పంటలు వేసే ముందు వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటలు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని దర్శి కృషి విజ్ఞాన కేంద్ర వాతావరణ శాస్త్రవేత్త ఆర్ కాశీ విశ్వనాథ్ తెలిపారు. మండలంలోని నాయుడుపాలెం వేంపాడు గ్రామాలలో శనివారం దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపన బోయిన వెంకటరావు అధ్యక్షతన శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎస్సీ రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ పంటలపై అవగాహన పెంచుకొని వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు వేస్తే చీడపీడల ఆశించకుండా పంటలు దిగుబడులను సాధిస్తాయి అన్నారు. వ్యవసాయ అధికారిని ఎన్ మేరమ్మ మాట్లాడుతూ రైతులు భూమిలోని మట్టిని భూసార పరీక్షలకు పంపి వాటి ఆధారంగా పంటలు వేసుకున్నట్లయితే పంట దిగుబడి వస్తుందన్నారు. భూసార కేంద్ర నిపుణులు జి చిన్ననారాయణ మాట్లాడుతూ పంట పొలాల్లో పచ్చి రొట్ట విత్తనాలు వేసి బాగా పెరిగిన తర్వాత కోసి భూమిని కలియ దున్నితే మట్టి కింద పడిపోయి నేలకు బలాన్ని ఇచ్చి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. దళిత బహుజన రిసోర్సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ పంట మార్పిడిని ఎంచుకొని పంటలు వేస్తే బాగా పండుతాయి అన్నారు. పంట పంటకు మూడు నెలలపాటు నేలను ఎండబెట్టిన తర్వాత ఎరువు వేసి కలియ దున్నితే భూమి సారవంతంగా మారి పంట ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. అనంతరం మట్టితో భూసార పరీక్షలు చేసి ఎస్సీ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు టి వీరాంజమ్మ, టీ శోభారాణి, ఎస్సీ రైతులు పాల్గొన్నారు.
