వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ప్రతి ఏటా ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వారిని సత్కరిస్తుంది. 2020-21 తొలిసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండోసారి 2021 ఏప్రిల్ 14న.. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 7 నుంచి నెల రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వాలంటీర్ల పనితీరుపై ప్రజల అభిప్రాయాలు, సంతృప్తిని పరిగణలోకి తీసుకుని.. ఉత్తమ సేవలు అందించిన వారికి సత్కారం చేస్తున్నారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల హాజరుతో పాటూ ప్రతినెలా మొదటి రోజునే వంద శాతం లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ.. క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు వంటి అంశాలలో పనితీరు ఆధారంగా వాలంటీర్లను అంచనా వేస్తారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులకు ఎంపిక చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డును అందుకునే వారికి రూ.30వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికేట్‌తో సత్కరిస్తారు. అలానే ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున.. అదే నగర కార్పొరేషన్‌కు 10 మంది చొప్పున వాలంటీర్లకు సేవారత్న అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకునే వారికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికేట్లతో సత్కరిస్తారు.
ఇక మూడో అవార్డు విషయానికి వస్తే.. కనీసం ఏడాది పాటు సర్వీస్ పూర్తి చేసుకుని ఎలాంటి ఫిర్యాదుల్లేకుండా పనిచేసే మిగిలిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర అవార్డు అందజేస్తారు. ఈ అవార్డుతో పాటు రూ.10 వేల నగదు బహుమతిని అందిస్తారు. ఈ అవార్డులను 2021లో 2,20,993మందికి అందించగా.. 2022లో 2,33,33మందికి ప్రదానం చేశారు. ఈ ఏడాది 90శాతంమందికిపైగా వాలంటీర్లు ఏదో ఒక అవార్డును అందుకోనున్నారు. అయితే గత నెల అనగా ఏప్రిల్‌లోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినా కుదరలేదు. మే మొదటి వారంలో నిర్వహించాలని భావించినా.. చివరకు ఈ నెల 19న ముహూర్తం ఫిక్స్ చేశారు.