పరిహారం పొందే విషయంలో రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే యంత్రాంగం తప్పు లేనప్పటికీ ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
● రైల్వే శాఖకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
● బాధితులకు రూ.8 లక్షలు ఇవ్వాలని
దక్షిణ మధ్య రైల్వేకు ఆదేశం
పరిహారం పొందే విషయంలో రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే యంత్రాంగం తప్పు లేనప్పటికీ ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణికుల హక్కులు, రైల్వే అధికార యంత్రాంగం బాధ్యతలను గుర్తు చేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె.మహేశ్వరిల ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది. రైలు బోగీలో రద్దీ కారణంగా కిందికి జారి పడ్డ ఓ ప్రయాణికుడు తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. పరిహారం ఇప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు రైల్వే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆయన వద్ద టికెట్ లేదని, అందువల్ల అధీకృత ప్రయాణికుడు కాడంటూ పరిహారం చెల్లించడానికి నిరాకరించింది.
హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. పరిశీలించిన ధర్మాసనం రైల్వే చట్టంలోని నిబంధనలను ప్రస్తావించింది. ప్రయాణంలో ప్రమాదం జరిగినప్పుడు…అందుకు రైల్వే యంత్రాగం నిర్లక్ష్యం, తప్పిదం లేన్పటికీ.. పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. టిక్కెట్ లేనంత మాత్రాన అసలైన ప్రయాణికుడు కాడని చెప్పలేరని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్, ఇంక్వెస్టు నివేదిక, పోస్టుమార్టం నివేదిక, తుది నివేదికలో ఆ వ్యక్తి రైలు నుంచి కింద పడి మరణించినట్టు స్పష్టంగా ఉందని తెలిపింది. ఈ ప్రమాదాన్ని దక్షిణ మధ్య రైల్వే కూడా కాదనడం లేదని గుర్తు చేసింది. కేవలం టికెట్ లేదన్న ఒక్క కారణం చూపి పరిహారాన్ని నిరాకరించలేరని తెలిపింది. అందువల్ల సవరించిన పరిహారం నిబంధనల ప్రకారం రూ.8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
*పన్ను చెల్లిస్తే దొంగ ఓనర్ కాలేడు*
వస్తువును దొంగిలించిన వ్యక్తినే దానికి యజమానిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ‘69ఏ’కు వివరణ ఇస్తూ ఈ విషయాన్ని తెలిపింది. సెక్షన్ 69ఏ ప్రకారం…ఎవరి వద్ద అయినా ‘లెక్కల్లో చూపని ధనం’ దొరికితే దానికి యజమాని ఆ వ్యక్తే అవుతాడు. రికార్డుల్లో నమోదు చేయని నగదు, విలువైన వస్తువులకు ఆ వ్యక్తినే సొంతదారుగా పరిగణిస్తారు. ఈ సెక్షన్ ప్రకారమయితే దొంగనే యజమానిగా గుర్తించినట్టవుతుందని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. అలా చేస్తే వాటి అసలు యజమాని వాటికి సొంతదారు కాకుండా పోతాడని తెలిపింది. ఇది న్యాయం అనిపించుకోదని, విపరీత పరిణామాలకు దారి తీస్తుందని పేర్కొంది.
తారు రవాణా చేయడానికి కాంట్రాక్టు పొందిన వ్యక్తికి ఐటీ విధించే విషయమై తలెత్తిన సమస్యను పరిష్కరిస్తూ ఈ సెక్షన్ అమలుపై స్పష్టత ఇచ్చింది. దొంగతనానికి గురైన వస్తువుకు దొంగే యజమాని కాలేడని పేర్కొంది. అలాగని అలాంటి వస్తువులకు యజమాని ఎవరూ ఉండరని భావించడం కూడా తగదని పేర్కొంది. ఈ రెండు అంశాలను సమన్వయం చేసుకుంటూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుదని తెలిపింది. ప్రస్తుత కేసులో దొంగతనానికి గురయిన తారుకు రవాణా కాంట్రాక్టరును సెక్షన్ 69ఏ ప్రకారం యజమానిగా పరిగణించకూడదని, దానికి పన్ను వేయడం సరికాదని తెలిపింది.