సంక్షేమ, పొదుపు సంఘ పథకాలు ఉపయోగించుకుని ప్రజలు తమ జీవనోపాధులు మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీఆర్డీఏ, వైఎస్సార్ క్రాంతి పథం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ బి. బాబు రావు అన్నారు. దొనకొండ వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయంలో శుక్రవారం మండలంలోని గ్రామైఖ్య సంఘ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ …. పొదుపు సంఘంలో ఉన్న ప్రతి మహిళకు చిన్న, మధ్య తరహా యూనిట్ల స్థాపనకు రుణాలు మంజూరు చేయించి ఆర్థికంగా వృద్ధి చెందేలా చేయూత ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరించారు. డైరీ యూనిట్లు, పొట్టెళ్లు, ఫుడ్, కారం, పిండి మిషన్ల ఏర్పాటు, డీజె, సెంట్రింగ్ చెక్క ఏర్పాటుకు రుణాలు ఇప్పించాలని కోరారు. బడుగు వికాసం ద్వారా ట్రాన్స్పోర్టు కార్లు, ట్రాక్టర్లు, ఫోర్ వీల్ ఆటోలు మొదలైనవి రుణాల మంజూరుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఆర్థిక వనరుగా ఉపయోగించుకొని ఆదాయం పెంచుకోనేలా పొదుపు సంఘాలలో చర్చించి అవగాహన పెంచాలని కోరారు. అదే విధంగా రుణాలు సకాలంలో వసూలు చేసి చెల్లించి ఆర్థికంగా పరపతి పెంచుకోవాలని సూచించారు. ప్రతి రుణం నూరు శాతం రికవరీ ఉండాలని చెప్పారు. పనిచేయని సిబ్బందిపై చట్టప్రకారం తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముందుగా లేటెస్ట్ సెంట్రింగ్ యూనిట్ ను పరిశీలించి యజమాని ధనలక్ష్మి ద్వారా సాయి బాబ పొదుపు సంఘ సభ్యులు వివరాలు సేకరించారు. జిల్లాలో లెటెస్ట్ సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు మరింత అవకాశం ఉన్నట్లు పీడీ తెలిపారు. కెనరా బ్యాంకు మెనేజర్ అశోక్ మాట్లాడుతూ …పొదుపు సంఘ సభ్యులు యూనిట్స్ స్థాపించుకుని అభివృద్ధి చెందటానికి తమ వంతు రుణం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లైవ్లీ హుడ్ (ఎల్ హెచ్) డీపీఎం డేవిడ్, బ్యాంకు లింకేజి డీపీఎం సుబ్బారావు, ఎరియా కోఆర్డినేటర్ వసుంధర దేవి, ఎపీఎం వెంకటేశ్వర్లు, సీసీలు పాల్గొన్నారు.

