సీఎస్ఈ సీటుకు ఆస్తులు**అమ్ముకోవాల్సిందే! -ఇంజినీరింగు ప్రైవేటులో ఏడాదికి రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల ఫీజు -పోటీ పెరగడంతో ఇంటర్, జేఈఈ మార్కుల ఆధారంగా సీట్లు

ఇంజినీరింగ్‌ విద్యా సంస్థలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ) సీటు కావాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సివిల్‌, మెకానికల్‌లాంటి కోర్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గిపోగా.. ప్రతి ఒక్కరూ సీఎస్‌ఈ వైపే మొగ్గు చూపిస్తున్నారు. సీఎస్‌ఈ సీట్ల కోసం వస్తున్న భారీ డిమాండ్‌తో కొన్ని కళాశాలలు ఫీజులు పెంచేశాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ ప్రవేశాల హడావుడి కొనసాగుతోంది. విశాఖపట్నంలోని ఓ ప్రముఖ కళాశాల బీటెక్‌ నాలుగేళ్లకు కలిపి రూ.16.60లక్షలు అడుగుతోంది. దీనికి వసతి ఫీజు అదనం. వసతికి ఏడాదికి రూ.1.50లక్షలు తీసుకుంటోంది. ఇదే నగరంలోని మరో కళాశాల డొనేషన్‌ కింద ఆరేడు లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. మరో స్వయంప్రతిపత్తి కళాశాల రూ.5లక్షల డొనేషన్‌తోపాటు ఏటా రూ.2.50లక్షలు చెల్లించాలని అడుగుతోంది. విజయవాడ సమీపంలోని ఓ ప్రముఖ కళాశాల డొనేషన్‌ రూ.7లక్షలు అడుగుతోంది. ఇది కాకుండా ఏటా రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షలు చెల్లించాలనే నిబంధన పెడుతోంది. అమరావతిలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం రూ.4.50లక్షల నుంచి రూ.5లక్షలు ఫీజు తీసుకుంటోంది. మరో ప్రైవేటు విశ్వవిద్యాలయం రూ.3.50లక్షల ఫీజు నిర్ణయించింది. ఈ వర్సిటీలు తాము పెట్టే పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా కొంత రాయితీ ఇస్తున్నాయి. విజయవాడలో ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు కళాశాలలు ప్రభుత్వం నిర్ణయించిన కన్వీనర్‌ కోటా ఫీజుపై మూడింతలు తీసుకుంటున్నాయి. దీనికి అదనంగా రూ.లక్ష డొనేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. గుంటూరులోని ఓ ట్రస్టు కళాశాల కన్వీనర్‌ కోటాపై మూడింతలు ఫీజు తీసుకుంటోంది. కర్నూలులోని ఓ ప్రముఖ కళాశాల ప్రతిభ ఉన్నవారికే సీటు ఇస్తామనే నిబంధన పెట్టింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*♦️ప్రతిభకు పరీక్ష..*

సీఎస్‌ఈ సీటు కోసం తాకిడి అధికంగా ఉన్నందున చాలా కళాశాలలు విద్యార్థుల మెరిట్‌ను చూస్తున్నాయి. ఇంటర్మీడియట్‌లో 90%పైగా మార్కులు ఉండాలని, జేఈఈ మెయిన్‌లో 75% మార్కులు వచ్చి ఉండాలనే నిబంధన పెడుతున్నాయి. డీమ్డ్‌ వర్సిటీలు మార్కులను బట్టి ఫీజుల స్లాబ్‌లు పెట్టాయి. మెరిట్‌ లేకపోతే డొనేషన్లను పెంచేస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రముఖ కళాశాల ఈఏపీసెట్‌లో 10వేలలోపు ర్యాంకు వస్తే 15శాతం రాయితీ ఇస్తోంది. జేఈఈలో వచ్చిన మార్కుల ఆధారంగా మరికొంత మినహాయింపునిస్తోంది.

*♦️అన్ని సీట్లూ ఒక్క బ్రాంచిలోనే..*

చాలా కళాశాలలు కోర్‌ ఇంజినీరింగ్‌, ఐటీ సీట్లను తగ్గించేసుకుని, సీఎస్‌ఈ సీట్లను పెంచేశాయి. విశాఖపట్నంలోని ప్రముఖ కళాశాలలో ఒక్క సీఎస్‌ఈలోనే 25 సెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన 1,500మంది విద్యార్థులు ఇక్కడ ప్రవేశాలు పొందారు. విజయవాడ సమీపంలోని కళాశాలలో 28సెక్షన్లు పెట్టారు. ఇక్కడ సీఎస్‌ఈ బ్రాంచిలో 1,680 సీట్లు ఉన్నాయి. అమరావతిలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో 2,200మంది సీఎస్‌ఈలో చేరారు. గతంలో సీఎస్‌ఈ రెండు సెక్షన్లు ఉండే సింగిల్‌ కళాశాలలు సైతం మూడు, నాలుగు సెక్షన్లకు పెంచేశాయి.

*♦️మధ్య తరగతి సతమతం*

ఎవరైనా ఒక విద్యార్థి ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీ, ప్రముఖ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేయాలంటే తక్కువలో తక్కువ వేసుకున్న రూ.18లక్షల నుంచి రూ.20లక్షలు వ్యయమవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించలేక మధ్యతరగతి వారు సతమతమవుతున్నారు. కొందరు పిల్లలు చదువుల కోసం పొలాలు, ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ఫీజులను చెల్లించలేని వారు ఎక్కడో చోట కన్వీనర్‌ కోటాలో వచ్చిన సీటులో చేరిపోదామని నిర్ణయించుకుంటున్నారు. కోర్‌ ఇంజినీరింగ్‌ సివిల్‌, మెకానికల్‌, ఈఈఈలాంటి వాటిలో ఎక్కువగా ఉద్యోగావకాశాలు లేకపోవడంతో విద్యార్థులందరూ సాఫ్ట్‌వేర్‌ బాట పడుతున్నారు. కనీసం ఉద్యోగం రాకపోయినా ఎంఎస్‌ కోసం అమెరికానో, ఏ ఇతర దేశాలకు వెళ్లొచ్చనే అభిప్రాయంతో ఉంటున్నారు.

*♦️పక్క రాష్ట్రాలకు పయనం..*

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు విద్యార్థులు తరలిపోతున్నారు. ఈ రాష్ట్రాలకు చెందిన కొన్ని వర్సిటీలు కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని, ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *