ఖరీఫ్ సీజన్లో భాగంగా సజ్జ పంట వేయడానికి సమయం ఆసన్నమైనదని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరులో సోమవారం సజ్జ పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో ప్రసాదరావు మాట్లాడుతూ… చిరుధాన్యాల పంటల్లో సజ్జ పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని ఇది ఏ నెలలోనైనా మంచి పంటతో పాటు అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. తేలికపాటి ఎర్ర నేలలు, నల్ల నెలలు తదితర అన్ని రకాల నేలల్లో ఇది చక్కగా దిగుబడినిస్తుందని ఆయన తెలిపారు. ఎకరాకు రెండు కిలోల సజ్జ విత్తనాలు సరిపోతాయని ఆయన సూచించారు . కిలో విత్తనానికి మూడు గ్రాముల ధరమ్ తో విత్తన శుద్ధి చేసినట్లయితే చీడా పీడల బారిన పడకుండా మంచి పంట దిగుబడి పొందవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
