దర్శి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా అధికారులందరూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. స్థానిక అద్దంకి రోడ్డులో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తో కలిసి నియోజకవర్గస్థాయి అభివృద్ధిపై సోమవారం కలెక్టర్ సమీక్ష నిర్వ హించారు. తాగునీరు, ఇళ్ల నిర్మాణం, రోడ్లు, విద్యుత్తు సబ్ స్టేషన్లకు భూములు కేటాయింపు, సాగర్ కాలువపై వంతెన నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. అర్హులకు భూములు కేటాయించేలా అసైన్ మెంట్ కమిటీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటివరకు మండలస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించామని, ఇక ముందు నియోజకవర్గ స్థాయిలో నియమిస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా నియమితులైన డీపీవో నారాయణరెడ్డి ఇక నుంచి అభి వృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేస్తారని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకొక సారి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రాధాన్యం ప్రాతిపదికన ప్రగతి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దర్శి, కురిచేడు మండలాలకు తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లు పాడయ్యాయని, వీటిని పరిష్కరించాలని కోరగా, నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్లు చెప్పారు. కురిచేడు-దొనకొండ రోడ్డుకు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. డిగ్రీ కళాశాలకు భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, డీపీవోనారాయణ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
*సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజాప్రతినిధులు*
కురిచేడుకు చెందిన వైకాపా నాయకులు షేక్ సైదా మంచినీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కొత్తపల్లి సర్పంచి రామారావు కలుషిత మైన తాగునీటిని సీసాలో తీసుకొచ్చి అధికారులకు చూపించారు. దర్శి వైసిపి నాయకుడు అంజిరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జగనన్న కాలనీలో పేదలకు 5,230 ఇళ్లు మంజూరవగా 2,000 గృహాలు ఇంకా మొద లవలేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.

