క్లాప్ మిత్ర, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం ఎ.పి. గ్రామపంచాయితీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఎ.ఇశ్రాయేలు అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర పేరుతో గ్రామాల్లో పరిశుభ్రతను కాపాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాణాలను ఫణంగా పెట్టీ దుర్గంధంతో కూడిన చెత్త, మురికి, జంతు కళేబరాలను ఎత్తివేస్తున్న కార్మికులు ఆకలి కేకలు కనిపించటంలేదా అని ప్రశ్నించారు. .
9 నుండి 16నెలలు జీతాలు చెల్లించకుండా కార్మికుల భార్యాబిడ్డలు పస్తులతో ఉంచటమే… సి.ఎం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న దళితులు, పేదల సంక్షేమమా అని ప్రశ్నించారు. పంచాయితీ కార్మికులకు హెల్త్ అలవెన్స్ అమలుచేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు కార్మికుల నియమించిన ప్రభుత్వం జీతాలు ఇచ్చే బాధ్యత నుండి తప్పుకోవటం సిగ్గుచేటన్నారు. నిధుల లేమితో కునారిల్లుతున్న గ్రామపంచాయితీల కార్మికుల జీతాల భారం వేయడంతో నెలల తరబడి జీతాలు చెల్లించటంలేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా తక్షణం 15వ ఆర్ధిక సంఘం నిధులు నుండి క్లాప్ మిత్ర, కాంట్రాక్ట్ కార్మికుల జీతాల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. భవిష్యత్ లో ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలన్నారు. .
పంచాయితీలకు కార్మికుల జీతాలకు అయ్యే బడ్జెట్ అదనంగా ఇవ్వాలన్నారు. క్లాప్ మిత్ర, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టరేట్ లను స్థబింపచేయాల్సి వస్తుందన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి టి. రంగారావు మాట్లాడుతూ…. స్వచ్ఛ భారత్ కార్మికులకు 2019లో ప్రభుత్వం పెంచిన రూ.10వేల రూపాయల వేతనాలు అమలు చేయాలన్నారు. కార్మికులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా రెవిన్యూ అధికారికి ప్రతినిధి బృందం సమస్యలపై పై వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, ఎ.పి.గ్రామపంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా నాయకులు యం. దానయ్య, యస్. గాలెయ్య, గోపాల్, కె.శ్రీను, అశోక్, నారాయణమ్మ, లక్ష్మీదేవి, జాన్, బసవయ్య
పాల్గొన్నారు.


