భారత్ అప్రతిహత జైత్రయాత్రలో మరో అడుగు విజయవంతంగా పడింది… 1983,2003, 2011… ఈ క్యాలెండర్లలో ఇప్పుడు 2023 చేరింది…అభిమానుల కలలను నిజం చేసే అంచనాలను నిలబెట్టే ప్రయత్నంలో టీమిండియా మరోసారి తుది
పోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్
పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది…
ఆసక్తకిరంగా, అక్కడక్కడా పోటాపోటీగా సాగిన
సమరంలో న్యూజిలాండ్ పై విజయం సాధించి సగర్వంగా నిలిచింది. గత వరల్డ్ కప్లో
ఇదే కివీస్ చేతిలో ఇదే సెమీస్ మ్యాచ్లో ఎదురైన ఓటమికి నాలుగేళ్ల తర్వాత
ప్రతీకారం తీర్చుకొని పాత గాయానికి మందు వేసింది. కోహ్లి, అయ్యర్, షమీ
ఈ గెలుపులో హీరోలుగా నిలిచారు.
397 పరుగులు… ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు ఒకదశలో ఆందోళనకు లోనైంది… ఆటగాళ్లలో నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి కనిపించి తప్పులు చేయడం మొదలైంది… అభిమానుల్లో కాస్త ఉత్కంఠ, మరి కాస్త ఆందోళన… పోరాటానికి మారుపేరైన కివీస్ తగ్గలేదు… 32 ఓవర్ల తర్వాత చూస్తే కివీస్ స్కోరు 219/2… అంతకుముందు ఈ స్థితిలో భారత్ 226/1… పెద్ద తేడా ఏమీ లేదు. తర్వాతి ఓవర్లలో చెలరేగేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. అప్పుడొచ్చాడు షమీ… ఒకే ఓవర్లో రెండు వికెట్లతో కివీస్ వెన్ను వెరిచి మళ్లీ కోలుకోలేకుండా చేశాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించి భారత్ తరఫున అత్యుత్తమ వన్డే గణాంకాలతో జట్టును ఫైనల్ కు చేర్చాడు.


