యువత సన్మార్గంలో నడవాలని, అప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొండా డివిజన్ లోని ఆదయ్య నగర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సనత్ నగర్ నియోజకవర్గంలోని యూత్ తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తల సాని
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షలాది మంది యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. యువత ఉన్నత లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని వివరించారు. యువత ఉన్నతంగా అభివృద్ధి సాధించినప్పుడే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సుమాజంలో గౌరవ ప్రదమైన గుర్తింపు తీసుకొచ్చిన వారవుతారని చెప్పారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే వివిధ ప్రభుత్వ శాఖలలో 1.30 లక్షల ఉద్యోగాలను TSPSC ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. IT మంత్రి KTR గారి కృషితో రాష్ట్రంలో రంగం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. 2014 లో 3 లక్షల ఉద్యోగాలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 10 లక్షల వరకు పెరిగిందని తెలిపారు. యువతకు అండగా నిలిచే BRS పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ నెల 30 వ తేదీన జరిగే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



