టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆధారాలు లేని కేసుల పరంపర కొనసాగుతోందని, చంద్రబాబుపై కేసు పెట్టడమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. విలువ లేని కాగితాలను ఆధారాలుగా చూపిస్తూ.. రాజ్యాంగ సంస్థలు ఆమోదించిన విషయాలపై కూడా కోర్టులకు వెళ్లే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతయినా ఉందని నూకసాని అన్నారు.
2015-16 సంవత్సరానికి మద్యం విధానం నిర్ణయం కోసం అప్పటి కమిషనర్ నరేష్ మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం కలిసి ప్రభుత్వానికి నోట్ పంపించారని అందులో ముఖ్యమైన తెలంగాణలో షాపుల సంఖ్యను పెంచడం, మద్యం ధరలను తగ్గించడం, రాష్ట్రంలో వినియోగం తగ్గుముఖంలో ఉండడం, పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని పాలసీ నిర్ణయం చేయాలని వారు కోరారు. మద్యం విధానంపై కేబినెట్ మూడు సమావేశాల్లో చర్చించింది, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాలుగో సమావేశంలో విధివిధానాలను రూపొందించారని నూకసాని తెలిపారు. ప్రస్తుతం డెప్యుటేషన్‌లో హోదాకు మించిన ఉద్యోగాన్ని చేస్తున్న వాసుదేవ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో కేబినెట్లో చర్చించకుండా ఆ విషయాలపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా మద్యం షాపులపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారని ఆరోపణ చేశారని నూకసాని అన్నారు. ఈయన స్థాయికి కేబినెట్ సమావేశాల మీద ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫిర్యాదు ఏమిటనేది ప్రజలు గమనించాలని నూకసాని విజ్ఞప్తి చేశారు. ఈ కేబినెట్ తీర్మానంపై అప్పటి ప్రధాన కార్యదర్శి 22.06.2015న సంతకం చేశారు. విశేషం ఏమిటంటే అదే రోజు ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా ఉన్న అజేయ కల్లాం రెడ్డి తానే సంతకం చేసి జీవో నెం.216, తేది.22.06.2015 మరియు జీవో నెం.217, తేది. 22.06.2015లను విడుదల చేశారని నూకసాని తెలిపారు. ఈ జీవోల ద్వారా ఆయన ఎక్సైజ్ రూల్స్ కు సవరణలు చేసి అనేక నిర్ణయాలను ప్రకటించారని, అందులో ముఖ్యమైనవి.. షాపులకు సంబంధించి అప్పటి వరకు అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజు విధానాన్ని ఆయన రద్దు చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు.
ఏదైనా ఒక షాపు నిర్దేశించిన లైసెన్సు ఫీజుపై ఆరు రెట్లకు మించి వ్యాపారం చేస్తే అధనపు అమ్మకాలపై 8% పన్ను, వ్యాట్ చెల్లించాలి. దీని వలన కొన్ని షాపుల వారు ఎం.ఆర్.పిని మించి అమ్మడం, వేరే షాపులపై ఆర్డరు పెట్టి ఇక్కడ అమ్ముకోవడం లాంటి అవకతవకలకు పాల్పడేవారని, దీనిని అరికట్టడం కోసమే ఈ ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడం జరిగిందని నూకసాని తెలిపారు. దానిపై అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర గానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు గానీ సంతకమే చేయలేదని నూకసాని తెలిపారు. కేవలం ముఖ్యకార్యదర్శి అజేయ కల్లాం మాత్రమే నిర్ణయం తీసుకుని ఆ జీవోను విడుదల చేశారని నూకసాని అన్నారు. ఇంతటి తప్పుడు ఆరోపణలకు పాల్పడిన ప్రభుత్వ అధికారి వాసుదేవ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నూకసాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత బార్ పాలసీని నిర్ణయించడం కోసం అప్పటి కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాంకి కొన్ని సూచనలు చేస్తూ పంపిన నోట్ ఫైలుపై అజేయ కల్లాం ఇప్పటికే ఈ విషయాలను మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించానని, కేవలం లాంఛనంగా మాత్రమే వారి సంతకాలకు పంపుతున్నానని స్పష్టంగా రాశారని నూకసాని తెలిపారు. ఆఫైలుపై అజేయ కల్లాం సూచించిన విధంగా మంత్రి, ముఖ్యమంత్రి సంతకాలు చేశారని, మరి వాసుదేవ రెడ్డి కి ఇందులో ఏదో కుంభకోణం ఉందని అర్థమైపోయిందట, ఆయన దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేయడం, వారు షరామామూలుగా కేసు నమోదు చేసి భయంకరమైన వాదనలు చేయడం విడ్డూరంగా ఉందని నూకసాని ఎద్దేవా చేశారు.
ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు వల్ల రూ.1299 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిందని దీనికి చంద్రబాబు, కొల్లు రవీంద్ర బాధ్యత వహించాలని సీఐడీ వారి వాదన. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లు వీరి పనితీరు ప్రతి కేసులోనూ కనిపిస్తోందని నూకసాని ఎద్దేవా చేశారు.
జీవో నెం.216, జీవోనెం.2017 తేది.22.06.2015లను స్వయంగా మంత్రి, ముఖ్యమంత్రి సంతకం లేకుండా విడుదల చేసి షాపులపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన అజేయ కల్లాంపై కేసు నమోదు చేసి రూ.1299 కోట్లు ఆయన నుండి వసూలు చేస్తారా? సీఐడీ సమాధానం చెప్పాల్సి ఉంది. లేదా అది తప్పుడు అంచనా అని అజేయ కల్లాం తన అధికారాల మేరకు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నారని భావించి వాసుదేవ రెడ్డిపై చర్యలు తీసుకుని, తప్పుడు కేసులు పెట్టినందుకు అరెస్టు చేస్తారా అని నూకసాని బాలాజీ ప్రభుత్వానికి సవాలు విసిరారు.

