నిష్పక్షపాతంగా ప్రభుత్వ పథకాల అమలుతో ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. తాళ్లూరు మండలంలోని మల్కాపురం, దారంవారిపాలెం గ్రామాలలో ఆదివారం వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ షేక్ వలి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలతో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి తాళ్లూరు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్ షేక్ ఖాదర్ మస్తాన్ బి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పాల్గొని రోగులకువైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంగన్వాడీ ఆధ్వర్యంలో, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. బాల బాలికల పలు దేశభక్తి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలలో విశేష సేవలు అందించిన వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. మండల వైస్ ఎంపీపీ ప్రియాంక నాగార్జునరెడ్డి, ఎంపీటీసీలు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, , మంచాల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కేయుగకీర్తి, వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు, ఆయా గ్రామాల కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

