రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించే ఇళ్లస్థలాల కోసం 23 నవంబర్, 2023న ప్రారంభమైన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 5,756 దరఖాస్తులు అందాయని, 6 జనవరి, 2024తో గడువు ముగుస్తున్నందున అర్హులైన జర్నలిస్టులందరూ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్ల స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 535ను జారీ చేసిందని తెలిపారు. జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలను, జర్నలిస్ట్ గా వారి వృత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధృవీకరించి ఇప్పటివరకు 4,742 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితాను తదుపరి వెరిఫికేషన్ కోసం 26 జిల్లాల కలెక్టర్లకు పంపించడం జరిగిందన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 535 లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి దరఖాస్తులను, నిర్దేశించిన వయస్సు, సరైన సమాచారం పొందుపరచని, మీడియాలో పనిచేసిన అనుభవ పత్రాలు పొందుపరచకపోవడం, సరైన అర్హతలు లేకపోవడం వంటి అంశాలకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న 935 మంది జర్నలిస్టుల దరఖాస్తులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం కల్పించామన్నారు. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత జర్నలిస్టులకు సందేశాలు పంపడం జరిగిందన్నారు. వివరాలు సరిచేసుకున్న అనంతరం సదరు జర్నలిస్టుల దరఖాస్తులను వెరిఫై చేసి కలెక్టర్లకు పంపిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికి 79 మంది జర్నలిస్టుల దరఖాస్తులు మాత్రమే ధృవీకరణ కోసం పెండింగ్ లో ఉన్నాయని. వాటి వెరిఫికేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఛైర్ పర్సన్ గా, జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి, డీఐపీఆర్వో, ముగ్గురు జర్నలిస్టులు సభ్యులుగా జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీని రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఏర్పాటు చేశామని కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంబంధిత కమిటీలు ఆయా జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాయని తెలిపారు. రెవెన్యూ శాఖ వెరిఫికేషన్ చేసిన అనంతరం పూర్తిస్థాయిలో ఇళ్ల స్థలాలకు అర్హులైన జర్నలిస్టుల తుది జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కేటాయించే ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ విలువ ప్రకారం 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
అర్హులైన అక్రిడిటేడ్ జర్నలిస్టులందరూ 6 జనవరి, 2024 వరకు అంటే నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాలను ప్రతి ఒక్క జర్నలిస్టు పొందాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సూచించారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు భారీ స్పందన -ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు 5,756 దరఖాస్తులు -4,742 దరఖాస్తుల ప్రాథమిక వెరిఫికేషన్ పూర్తి -దరఖాస్తులు అసంపూర్తిగా ఉండటంతో సరిదిద్దుకునేందుకు 935 దరఖాస్తుదారులకు మరో అవకాశం.. పెండింగ్ లో 79 దరఖాస్తులు -రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీల ఏర్పాటు -తదుపరి వెరిఫికేషన్ కు 26 జిల్లాల కలెక్టర్ లకు చేరిన దరఖాస్తులు – 6 జనవరి, 2024తో ముగియనున్న గడువు -నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జర్నలిస్టులకు సూచన – సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి
22
Dec