కాటం రాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ చైర్మన్ బొట్ల రామారావు యాదవ్ కోరారు. గొర్రెల కాపరుల సమావేశపు మందిరంలో సోమవారం కాటంరాజు జయంతిని నిర్వహించారు. రాష్ట్ర షీప్ ఫెడరేషన్ చైర్మన్ ప్రకాశ్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యశాఖ జెడీ డాక్టర్ బేబి రాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పశు, జంతు ప్రేమికులగా ఉండాలని, మూగ జీవాల ఆవేదనను గమనించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల రామారావు యాదవ్ మాట్లాడుతూ కాటమరాజు దక్షణ భారత దేశంలో తెలుగు సీమలో మహా పరాక్రమ వంతుడుగా పశుపోషకులకు ఆరాధ్యదైవంగా 12వ శతాబ్దంలో దాత నామసంవత్సరం. పాల్గుణ శుద్ద పంచమి నాడు గురువారం నాడు జన్మించాడని, ఆంగ్ల సంవత్సరం ప్రకారం 1217 పిభ్రవరి 12న పెద్దిరాజు, పెద్దమ్మ తందులకు జన్మించారని చెప్పారు. శ్రీక్రిష్ణుడి 23వ తరం వారు కాటంరాజుకు, నెల్లూరు సీమ ప్రభువు మనుసిద్ధికి మధ్య 1282లో జరిగిన యుద్ధంలో కాటంరాజు విజయం సాధించారని చెప్పారు. పశుపోషణ కోసం యుద్ధం జరగటం, యుద్ధంలో సైన్యం వీర మరణం పొందటంతో ఆవులు, కోడే దూడలు యుద్ధంలో పాల్గొనటం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదని చెప్పారు.
ఒంగోలు జాతి ప్రసిద్ధి చెందటానికి కాటం రాజే కారణం అని చెప్పారు. భవిష్యత్ తరాల రీత్యా మేలైన సంతానోత్పత్తి సామర్థ్యం కల్గిన పశుసంపదను సృష్టించటానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్ర షీప్ ఫెడరేషన్ చైర్మన్ ప్రకాశ్ యాదవ్ మాట్లాడుతూ కాటం రాజు జయంతిని జాతీయ పశుపోషణ దినోత్సవంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని కోరారు. కనిగిరి కొండపై ఉన్న కాటమరాజు కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలని, జిల్లాలో కాటమరాజు కారిడార్ ఏర్పాటు చేసి జాతీయ పశువైద్యశాల ఏర్పాటు చేసి, రెండు వందల అడుగుల కాటంరాజు విగ్రహం ఏర్పాటు చెయ్యాలని కోరారు. ఆయన చరిత్రనుపాఠ్యపుస్తకాలలో చేర్చాలని అన్నారు. పాదిలి కేంద్రంగా ఏడు శాసన సభ నియోజక వర్గాలు కలిపి కాటంరాజు జిల్లాగా ఏర్పాటు చెయ్యాలని కోరారు. ఐఎస్ఓపిఈడీ వెంకట రామిరెడ్డి, డాక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
