పేద ప్రజల సంక్షేమానికి సంక్షేమాలు తీసుకువచ్చిన మహనీయుడు డాక్టర్ దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ అని అన్నారు. డాక్టర్ దామోదరం సంజీవయ్య 104వ జయంతిని పురష్కరించుకుని బుధవారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా పాల్గొని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న డాక్టర్ దామోదరం సంజీవయ్య విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ కర్నూల్ జిల్లాలో జన్మించిన డాక్టర్ సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా అతి చిన్న వయస్సులో సేవలు అందించారని అన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య నిరాడంబరతకు మారు పేరుగా నిజాయితీకి నిలువు టద్దంగా నిలచి అందరికి ఆదర్శ ప్రాయుడయ్యారని కొనియాడారు. ప్రజా హితం కోసం సామాజిక భద్రత వంటి ఎన్నో సంస్కరణలు తీసుకవచ్చారని, అలాంటి మహానీయుని ఆశయాలను స్పూర్తిగా తీసుకుని వారి సంస్కరణలకు కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వారు చేపట్టిన సామాజిక భద్రత సంస్కరణ ఫలితంగా నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు పెన్షన్ పొందుతున్నారని అన్నారు.
ఎంపీ మాగంట శ్రీనువాసులు రెడ్డి మాట్లాడుతూ… బడుగు పేద ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతో డాక్టర్ దామోదరం సంజీవయ్య చేపట్టిన సంస్కరణలు నేటికి కూడ ఆచరణలో అమలు జరుగున్నాయని అన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్స్ కు ప్రాధాన్యత ఇచ్చి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణాలకు కారకులైనారని అన్నారు. నేటి యువత వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు చేపట్టిన సంస్కరణలు కొనసాగించాలని అన్నారు.
నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ … డాక్టర్ దామోదరం సంజీవయ్య గొప్ప సంస్కరణ వాది, నాయకుడని ఆయన దేశానికి, రాష్ట్రానికి నిస్వార్థమైన సేవలు అందించారని అన్నారు. ఆయన చేసిన సేవలు ఎనలేని వని నేటి యువత వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన వైనాన్ని వివరించారు. అనంతరం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో డాక్టర్ దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని డాక్టర్ దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కేకును కట్ చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసారు. ఆయా కార్యక్రమాలలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, డిటిసీ సుశీల, డాక్టర్ దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ ప్రతినిథులు వై అరుణ్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.




