పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సొరంగ మార్గాల వద్ద ఏర్పాటు చేసిన పైలాను ఆవిష్కరించారు. తొలుత వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ప్రదర్శన తిలకించారు. వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన సొరంగ మార్గాల్లో కొంత దూరం ప్రయాణించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం జగన్ మాట్లాడారు. కరువు ప్రాంత ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు వరమన్నారు. దివంగత సిఎం డాక్టర్ వైయస్ రాజ శేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారన్నారు. అప్పట్లో అధిక మొత్తంగా పనులు జరిగాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన సొరంగ మార్గాల పనులను
పూర్తిచేసి జాతికి అంకితం చేసే అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఈ ప్రాజెక్టును తనయుడిగా తాను ప్రారంభించటం నిజంగా అదృష్టమేనన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన పనులన్నీ పూర్తయినట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయంలో 820 అడుగుల్లో నీరు ఉందన్నారు. 840 అడుగులకు నీరు చేరగానే వెలిగొండకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే 4.47లక్షల ఎకరాలకు సాగురు అందుతుందన్నారు. 15.25 లక్షల మందికి తాగునీరు అందిస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాలు, నెల్లూరు జిల్లాలో 5 మండలాలు, కడప జిల్లాలో 2 మండలాలు వెలిగొండ పరిధిలో ఉన్నాయన్నారు. వెలిగొండ జలాలరాకతో కరువు పీడిత ప్రాంతం సస్యశ్యామలం కానుందని చెప్పారు.
నిర్వాసితులను ఆదుకుంటాం
వెలిగొండ కోసం త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటామన్నారు. వారికి అవసరమైన రూ. 1,200 కోట్ల ఆర్అండ్ఆర్ ప్యాకేజిని వచ్చే జూన్ లేదా జులైలో అందిస్తామన్నారు. అదే సీజన్లో నీటిని వెలిగొండకు విడుదల చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఈ లోగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పై కార్యక్రమాలన్నీ
జరిగిపోతాయన్నారు. వెలిగొండపై శ్రద్ధ చూపని చంద్రబాబు కరువు పీడిత ప్రాంతంలో నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుపై గత సిఎం చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ చూపలేదని సిఎం జగన్ విమర్శించారు. వెలిగొండలో కీలకమైన సొరంగాలను పూర్తి
ప్రారంభోత్సవంలో సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసిపి ఇన్ఛార్జులు చేయడంలో చంద్రబాబు విఫల మయ్యారన్నారు. మొదటి, రెండవ సొరంగాలు కలిపి 37.6 కిలో మీటర్లు ఉంటుందన్నారు. డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 కిలో మీటర్లు పని జరిగిందన్నారు. చంద్రబాబు కాలంలో జరిగిన పని కేవలం 6.6 కిలో మీటర్లు మాత్రమేనన్నారు. మిగిలిన 11 కిలో మీటర్ల మేర సొరంగాల తవ్వకాలను తాను పూర్తి చేశానని చెప్పారు. మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసినట్లు తెలిపారు. రెండవ సొరంగాన్ని గత నెలలో పూర్తి చేసి నేడు జాతికి అంకితం చేసినట్లు తెలిపారు.
చంద్రశేఖరను భారీ మెజార్టీతో గెలిపించాలి చెవిరెడ్డిని ఎంపీగా ఆశీర్వదించాలి
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తాటిపర్తి చంద్రశేఖర్ వైసిపి తరపున పోటీ చేస్తారని, భారీ మెజార్టీతో గెలిపించాలని సిఎం జగన్ కోరారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని చూపుతూ ఒంగోలు పార్లమెంట్ స్థానానికి వైసిపి తరపున పోటీ చేస్తున్నారని, ఇక్కడి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
మంచి ఎంపీగా చెవిరెడ్డి మీకు అండగా ఉంటారని చెప్పారు. అనంతరం మార్కాపురం వైసిపి అభ్యర్థిగా అన్నా వెంకట రాంబాబును, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందురు నాగార్జునరెడ్డిని పరిచయం చేశారు. వీరందరినీ వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి మేరుగ నాగార్జున, బుర్రా మధుసూదన్, ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులు ముందుకు రాగా…. మీ నియోజక వర్గాలకు వస్తాను…. అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని జగన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, పురపాలకశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎపిఐఐసి చైర్మన్ జంకె వెంకటరెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జడ్పి చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,ఎమెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి, తర్లుపాడు జడ్పిటిసి వెన్నా ఇందిర, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జలవనరుల శాఖ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.





















