ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై రాయి విసిరాడు. శనివారం రాత్రి విజయవాడలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు సెంటరులో మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా బస్సు పైనుండి ప్రజలకు జగన్ అభివాదం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి పూలతోపాటు విసిరిన రాయి అత్యంత వేగంగా వచ్చి ఆయన కనుబొమ్మ పైభాగంలో తాకింది దీంతో, సిఎంకు గాయమైంది. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న వైసిపి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కు కూడా రాయి తగిలి గాయమైంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు యాత్రను నిలుపుదల చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిఎంను టాప్ పై నుండి బస్సులోకి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సిఎం జగన్ బస్సులోనే కూర్చొని యాత్రను కేశరపల్లి వరకు కొనసాగించారు. అయితే వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జిజిహెచ్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. రాత్రి 12 గంటల వరకూ ఆయన జిజిహెచ్లో ఉన్నారు. చికిత్స అనంతరం కేశరపల్లికి తిరిగివెళ్లారు. దాడి విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. రోడ్ షోకు వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకే టిడిపి వారు దాడికి పాల్పడ్డారని వెలంపల్లి ఆరోపించారు.
త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోడీ
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.
స్టాలిన్, చంద్రబాబు ఖండన
జగన్ పై దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తదితరులు ఖండించారు. జగన్ పై జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. రాజకీయాలు ఎప్పుడూ హింసాత్మంగా మారకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.
సమగ్ర విచారణ జరిపించాలి సిపిఎం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి విసిరిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు
ఘటన దురదృష్టకరం: షర్మిల
జరిగిన దాడి బాధాకరం, దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా ఖండించాల్సిందేనని తెలిపారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విజయవాడలో ఘన స్వాగతం
కనక దుర్గ వారథి మీదుగా శనివారం సాయంత్రం 5.30 గంటలకు సిఎం బస్సు యాత్ర విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. బస్సు యాత్ర వాటర్ ట్యాంక్ రోడ్, శిఖామణి సెంటరు, చుట్టుగుంట, బిఆర్డిఎస్ రోడ్, భగత్ సింగ్ రోడ్డు, సింగ్ నగర్, కండ్రిక మీదుగా రామవరప్పాడు రింగ్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకుంది. విజయవాడ నగరంలో సుమారు మూడున్నర గంటలకు పైగా సాగింది. ఆనంతరం రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానూరు మీదుగా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.

