కిమ్స్ ఆస్ప‌త్రిలో ఘ‌నంగా జాతీయ‌స్థాయి రుమ‌టాల‌జీ స‌ద‌స్సు – శ‌ని, ఆదివారాల్లో క్లినిక‌ల్ రుమ‌టాల‌జీ కాన్ఫ‌రెన్స్-2024 -దేశం న‌లుమూల‌ల నుంచి 400 మంది రుమ‌టాల‌జిస్టుల హాజ‌రు -రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మాత్ర‌మే జ‌రిగే స‌ద‌స్సు

ఆర్థ‌రైటిస్, ఆస్టియో ఆర్థ‌రైటిస్, లూప‌స్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు త‌దిత‌ర రుమ‌టాల‌జీ స‌మ‌స్య‌ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక కొత్త ర‌కాల చికిత్సా ప‌ద్ధ‌తులు వ‌స్తున్నాయ‌ని, వీటి గురించి రుమ‌టాల‌జిస్టులు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ రోగుల‌కు సాంత్వ‌న క‌లిగించేందుకు ప్ర‌య‌త్నించ‌డం ముదావ‌హ‌మ‌ని కిమ్స్ ఆస్ప‌త్రుల ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు అన్నారు. ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో రెండు రోజుల పాటు జ‌రిగిన క్లినిక‌ల్ రుమ‌టాల‌జీ కాన్ఫ‌రెన్స్ 2024 (సీఆర్‌సీ 2024) ముగింపు సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. దేశం న‌లుమూల‌ల నుంచి 400 మందికి పైగా రుమ‌టాల‌జిస్టులు ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మాత్ర‌మే నిర్వ‌హించే ఈ స‌ద‌స్సులో ప్ర‌ధానంగా అనుభ‌వ‌జ్ఞులైన రుమ‌టాల‌జిస్టులు అత్యంత సంక్లిష్ట‌మైన కేసుల‌కు ఎలా చికిత్స చేశార‌న్న విష‌యాన్ని కేసుల వారీగా చ‌ర్చించిన తరువాత, స‌ద‌స్సులో పాల్గొన్న అంద‌రికీ ఈ త‌ర‌హా కేసుల‌కు ఎలా చికిత్స చేయాల‌న్న విష‌యాల‌ను సోద‌హ‌ర‌ణంగా వివ‌రించారు.
స‌ద‌స్సు ప్రారంభోత్స‌వంలో కిమ్స్ ఆస్ప‌త్రి సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు, నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మిను బాజ్‌పాయి, ఇండియ‌న్ రుమ‌టాల‌జీ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర‌, పాండిచ్చేరి జిప్‌మ‌ర్ రుమ‌టాల‌జీ విభాగాధిప‌తి, ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ మోలీ థాబా, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రి రుమ‌టాల‌జీ విభాగం క్లినిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శ‌ర‌త్ చంద్ర‌మౌళి, హైద‌రాబాద్ రుమ‌టాల‌జీ సెంట‌ర్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రాజ్‌కిర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
స‌ద‌స్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్ర మౌళి, సీఆర్‌సీ 2024 సైంటిఫిక్ ఛైర్ డాక్టర్ మోలీ థాబా నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, వాస్కులైటిస్, బాల్య ఆర్థరైటిస్, అరుదైన రుమాటిక్ కండిష‌న్ల‌ వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో ట్రైనీల కోసం రుమటాలజీ క్విజ్ కూడా నిర్వ‌హించారు. ఇది యువ రుమటాలజిస్టులకు వారి జ్ఞానాన్ని పరీక్షించడానికి ఆకర్షణీయమైన వేదికను అందించింది.
సీఆర్‌సీ 2024 ప్రత్యేకతలలో ఒకటి కొత్తగా చేర్చిన ఇమేజ్ పోటీ. స‌ద‌స్సులో పాల్గొన్న ప‌లువురు స‌ద‌స్సుకు త‌మ సృజనాత్మక కోణాన్ని జోడించారు. అదనంగా, భారతదేశం నలుమూలల నుండి 260 కేసు ల గురించి వివరించారు .ప్రతి కేటగిరీలో ఎంపిక చేసిన మొదటి కేసులను కాన్ఫరెన్స్ సెషన్లలో చర్చించారు.
ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ వీర‌వ‌ల్లి శ‌ర‌త్ చంద్ర‌మౌళి మాట్లాడుతూ, “సీఆర్‌సీ 2024 విజ‌య‌వంతం కావ‌డం, దేశవ్యాప్తంగా ఉన్న రుమటాలజిస్టులు ఉత్సాహభరితంగా భాగస్వామ్యం వ‌హించ‌డం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్క‌డ స‌ద‌స్సులో హాజ‌రైన అనుభ‌వ‌జ్ఞులైన రుమ‌టాల‌జిస్టులు అంద‌రూ త‌మ త‌మ విజ్ఞానాన్ని ప‌దిమందితో పంచుకోవ‌డం, అత్యంత స‌మ‌స్యాత్మ‌క‌మైన కేసుల గురించి చ‌ర్చించ‌డానికి ఈ స‌దస్సు ఒక విలువైన అవ‌కాశాన్ని క‌ల్పించిందనీ అన్నారు. ఇందులో ప్ర‌ధానంగా రుమాటిక్, కండరాల వ్యాధులపై అవగాహన పొంద‌గ‌లిగాము” అని అన్నారు.
భారతదేశంలో రుమటాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2024 ఒక ప్రముఖ వేదికగా త‌న ప్రాముఖ్యతను మరోసారి నిరూపించింది. రుమటాలజీలో విజ్ఞాన భాగస్వామ్యం, వృత్తిపరమైన అభివృద్ధి సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న సీఆర్‌సీ తదుపరి ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని బారు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *