మిచాంగ్ తుఫాన్ కారణంగా వీచిన గాలి, కురిసిన వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. తాళ్లూరు మండలంలో ఈనెల 1 నుండి 5వ తేది వరకు 174 మి.మీల వర్షపాతం నమోదు కాగా అందులో 76 మి.మీలు మంగళవారం నమోదు అయినది. నాగంబొట్లపాలెం, రామభద్రాపురంలతో పాటు కోతకు వచ్చిన 1010, ఇతర రకాల వరి నేల మట్టం అయ్యాయి. తాళ్లూరు మండలంలో ప్రాధమికంగా 815 ఎకరాల వరి, 120 ఎకరాల కంది, 240 ఎకరాల మొక్కజొన్న, 200 ఎకరాల మిరప, 25 ఎకరాల అరటి, 100 ఎకరాల పొగాకు నష్టవాటిల్లే అవకాశం ఉన్నట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. కొత్తపాలెంలో కోట సుబ్బా రెడ్డికి చెందిన అరటి తోట నేల మట్టం అవటంతో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి తోటను పరిశీలించారు. అదే గ్రామంలో రేగి తోట కొమ్మలు కూడ చీలి పోయి పూర్తిగా చెట్లు ధ్వసం అయ్యాయి.
పొంగిన వాగులు
తాళ్లూరు మండలంలో ప్రధాన వాగు అయిన దోర్నపు వాగు పొంగి పొర్లటంతో వాహనదారులను, ప్రజలను ఎస్సై వైవీ రమణయ్య అప్రమత్తం చేసారు. బెల్లంకొండ వారి పాలెం వద్ద వాగు పొర్లటంతో సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి ప్రొక్లయిన్ సహాయంతో వాగు ప్రక్కన పూడిక తీసి దర్శి, చీమకుర్తి రోడ్లో రాక పోకలకు అంతరాయం కలుగకుండా చూసారు.
ముండ్లమూరు మండలంలో కూడ చిలకలేరు వాగు పొంగిపొర్లటంతో వాగు వద్ద ప్రమాదాలు జరగకుండా ఎస్సె యూవీ క్రిష్ణయ్య బందోబస్తు ఏర్పాటు చేసారు.
అరటి, మొక్కజొన్న, మిరప, కంది,పొగాకు, వరి పంటలు నీట మునిగిదెబ్బతిన్నాయి. పసుపుగల్లులో అరటి తోటసగానికి విరిగి పడటంతో నష్టం వాటిల్లింది.మండలంలో తుఫాన్ ధాటికి 11కేవీ విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో రెండ రోజులు విద్యుత్సరఫరా నిలిచింది. ఏఈ వీరబ్రహ్మం సిబ్బందిని అప్రమత్తం చేసి దెబ్బతిన్న విద్యుత్లోన్లనుపునరుద్ధరించడంతో మద్యాహ్నం అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయగలిగారు.






