లక్కవరం పంచాయతీ నిధులు దోపిడి చేసిన ఘరానా దొంగల్ని అరెస్టు చేయాలని మాల మహానాడు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య డిమాండ్ చేశారు. ఆదివారం తాళ్లూరు వచ్చిన అంజయ్య లక్కవరం పంచాయతీ నిధుల దోపిడిపై విలేకరులతో మాట్లాడారు. చేయని పనులు చేసినట్టుగా రికార్డులు రాసుకొని, తప్పుడు బిల్లులు తయారు చేసుకుని, నిధులు డ్రా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ కాంపోనెంట్ నిధులను దారి మళ్లింపుకు కారణమైన సర్పంచ్ కు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. ఎస్సీల ప్రయోజనాల పట్ల వివక్ష మరియు నిర్లక్ష్యం, ఎస్సీల పట్ల విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వారు ఏ హోదాలో ఉన్నా కూడా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం శిక్షార్హులన్నారు. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కాంపోనెంట్ నిధుల దుర్వినియోగంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, తాళ్లూరు మండలంలో కొందరు నాయకులు అక్రమ సంపాదనకు అడ్డగోలు మార్గాన్ని ఎన్నుకున్నారన్నారు. తాళ్లూరు మండలంలో ఎస్సీ ఎస్టీ స్పెషల్ కాంపోనెంట్ నిధుల దుర్వినియోగాన్ని సహించేది లేదన్నారు.
