పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసం, శ్రవణా నక్షత్రం రోజున శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీగిరి గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టు సెంటర్ వద్ద గల శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం గోశాల వద్దనుండి గ్రంథాలయం, పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా కేశవస్వామిపేట, భగీరథ విగ్రహం చుట్టి శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్, గద్దలగుంట, కొణిజేడు బస్టాండ్ మీదుగా శ్రీగిరి చేరిన శ్రీవారి భక్త బృందం స్వామి వారిని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందారు. గిరి ప్రదక్షిణ అసాంతం గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ మార్గం మార్మోగింది. సుందరంగా అలంకరించిన స్వామి వారి రథం ముందుగా గోమాత కదలగా… గరుడ హనుమంత్, త్రిపుండ్రాలు శంకు చక్రాలు పట్టుకున్న భక్తులు నడుచుండగా గిరి ప్రదక్షణకు విచ్చేసిన వందలాది శ్రీవారి భక్తులు భక్తి పారవశ్యంతో గోవింద నామాలు పలుకుతూ గిరి ప్రదక్షిణ చేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని బయలుదేరిన భక్తులు ఎవరైనా ముందుగా శ్రీగిరి ప్రదక్షణ చేసుకొని స్వామిని దర్శించడం ఆనవాయితీగా మారాలని, అలా గిరి ప్రదక్షణ చేసుకొని స్వామివారిని దర్శించినంతనే ఆరోగ్యము, ఐశ్వర్యము, సకల సౌకర్యాలు లభిస్తాయి అని తెలిపారు. మరియు శ్రీగిరి శ్రీనివాసుని భక్తబృదం ఆధ్వర్యంలో పౌర్ణమి రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ గిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుందని, కావున పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసి శ్రీవారిని, స్కందగిరి పై ఉన్న గంగా పార్వతీ సమేత మహేశ్వరుని మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించాలని విజ్ఞప్తి చేశారు..




