బేగం పెట్, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ లో పేదల నివాసాలే లక్ష్యంగా ఇళ్ల కూల్చివేత జరిపిన ఎమ్యెల్యే దానం నాగేందర్ అనుచరులను క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలనీ సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇళ్ల కూల్చివేత బాధితులకు సిపిఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ బేగం పెట్, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ లో భూకబ్జాదారులు పేదల ఇళ్ళు కూల్చిన ప్రాంతాన్ని గురువారం సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ, సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, సిపిఐ సనత్ నగర్ నియోజకవర్గం కార్యదర్శి ఎండి. సలీం ఖాన్ లతోకలసి డా. కె. నారాయణ సందర్శించి, ఇళ్ళు కూల్చివేతలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా డా. కె. నారాయణ వద్ద బాధితులు కన్నీరుమొన్నిరుతో గత ఆరు నెలలుగా ఎమ్యెల్యే దానం నాగేందర్ అనుచరులు తమ ఇళ్ల వద్ద తిష్టవేసి భయబ్రాంతులకు గురి చేస్తూ, రోజు విధ్వంసం సృష్టిస్తూ తమ ఇళ్లను నేలమట్టం చేస్తూ అక్కడి నుండి తమను తరుముతున్నారని, ఇక్కడే జాగాలు కొని గత 40 ఏళ్ళ నుండి నివాసముంటున్నామని వారు తెలిపారు. ఈ సందర్బంగా డా. కె. నారాయణ మాట్లాడుతూ కూల్చివేసిన సుమారు 50 ఇళ్ల బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై లేదా అని, పేదలపై భూకబ్జాదారులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పేదల ఇళ్ళు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్యెల్యే దానం నాగేందర్ అనుచరులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చెర్యలు తీసుకొని, జైళ్లకు పంపాలని కోరారు. కూల్చివేసిన ఇళ్ళు తిరిగి నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహాయం అందించాలని అలాగే భూకబ్జాదారులు పేదల ఇళ్ళు కూల్చి కబ్జా చేయకుండా, బాధితులపై దాడులకు పాల్పడకుండా తగిన రక్షణ కల్పించాలని అయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు విజ్ఞప్తి చేసారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇస్తూ, దానం నాగేందర్ అనుచరులు తిరిగి పేదల జోలికొస్తే తాట తీస్తామని డా. కె. నారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు ఇంతియాజ్ ఖాన్, సైఫ్ ఖాన్, జావీద్, వెంకటేష్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

