అయోధ్య బాలరాముని కి మారిషస్ నుండి అక్షంతలు.అక్షత లిఖిత కళా జప మహోత్సవం పేరిట శ్రీరాముని కార్యక్రమాలు – సంజీవ నరసింహ

మోక్షపురి అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారిచే నిర్మితమైన భవ్యమైన దివ్య శ్రీ రామ మందిరంలో 22వ తేదీ సోమవారం బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుచున్నాయి. ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్న భారతీయులందరూ ఎంతో ఆత్రుతగా అట్టి మహోన్నతమైన కార్యక్రమానికై ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరు బాల రాముని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించాలని తహతహలాడుతున్నారు. అంతే కాకుండా ఏదైనా ఒక ప్రత్యేకమైన కానుకను స్వామి వారికి అందించాలని వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆ విధమైన కార్యక్రమాలలో భాగంగా మారిషస్ దేశ తెలుగు సాంస్కృతిక సంఘం జాతీయ అధ్యక్షులు సంజీవ నరసింహా అప్పడు ఆధ్వర్యంలో మారిషస్ ప్రభుత్వము మరియు భారతదేశ పుణ్యభూమి సహకారంతో మర్యాదాపురుషోత్తముడు, అయోధ్య రామచంద్రునకు ఉడతా భక్తిగా హృదయ పూర్వకంగా అక్షంతలను సమర్పించడానికి సమాయత్తమై ఉన్నారు.

ఈ సందర్భంగా సంజీవ నరసింహ అప్పడు చరవాణి ద్వారా మాట్లాడుతూ “శ్రీ అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట అక్షత లిఖిత కళా జప మహోత్సవం” పేరిట 3, 2 కొలతలు గల తెల్లని పేపర్ పై శ్రీరామ అక్షరాలను లిఖించి వాటిపై పసుపు వర్ణము, కుంకుమ వర్ణము అక్షతలను అంటించిన పదివేల కాగితాలను స్వామివారికి సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. మూడు వెడల్పు రెండు ఎత్తు కొలతలు గల తెల్లటి పేపర్లను మారిషస్ లోని ప్రతి గృహానికి పంపి భక్తితో రక్తితో అనురక్తితో శ్రీరామా అని పెద్ద అక్షరాలను లిఖించి వాటిపై కుంకుమ పసుపు కలిపిన అక్షతలను హృదయపూర్వకంగా శ్రీరాముని ధ్యానిస్తూ అంటించడం జరిగినదని వివరించారు. ఈ లిఖించిన కాగితాలన్నిటిని మారిషస్ లోని భారత రాయబార కార్యాలయానికి చేర్చి అక్కడినుండి అయోధ్య బాల రాముని పాదాల చెంతకు భద్రాచలంలోని శ్రీరాముని పాదాల చెంతకు చేర్చడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *