బాలికా హక్కుల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికా హక్కులపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఐసీడీఎస్, హెల్త్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అన్ని గ్రామాల్లో బాల్య వివాహల నిర్మూలన, బాలికా విద్య అవసరం, బాలికల హక్కులపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు. 18 ఏళ్లు నిండే వరకు ప్రతి ఆడపిల్ల చదువుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ మాధురి, మెప్మా పీడీ రవికుమార్, బత్తుల పద్మావతి, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వి.రామాంజనేయులు, డీసీపీవో దినేష్ కుమార్, డీఎల్పీవో ఆర్. పద్మ, సీడీపీవో కె.వి.పి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.







