సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ట్రాఫిక్ డీసీపీ సుబ్బరాయుడు సూచించారు. శనివారం ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగారావు, ఏసీపీ శంకర్ రాజు , ఇన్స్పెక్టర్లు వెంకట రాములు, ఉప శంకర్, ఆర్టీసీ ఆసిస్టెంట్ మేనేజర్ విజయకుమార్, ఆర్పీఎఫ్
ఇన్ స్పెక్టర్ సరస్వత్ లతో కలిసి ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్ నియంత్రణపై పలు సూచనలు చేశారు.
రైల్వే సైషన్ పరిసరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీ ఎక్కువంగా ఉంటుందని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు. రైల్వే స్టేషన్ ఔట్ గేటు వద్ద ఆర్టీసీ బస్సులు ముందుకు వచ్చి మలుపు తీసుకోకుండా చూడాలని, ఎక్కువ సమయం వేచి చూడటం వలన వెనుక వైపు బస్సులు బారులు తీరి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆయన చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్లకు, సెట్విన్ డ్రైవర్లకు కూడా అవసరమైతే ఒక సారి శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఆల్పా హోటల్ ఎదురుగా రెండు వైపుల నుంచి ఆటోలు వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో ఒక వైపు మాత్రమే అనుమతించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. అలాగే అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాల పార్కింగ్ రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేస్తున్న ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఫుట్ పాత్ వ్యాపారులు కూడా పుట్ పాత్, రోడ్డును ఆక్రమించకుండా తమకు కేటాయించిన స్థలాల్లో మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకునేలా చూడాలని చెప్పారు. రైల్వే స్టేషన్ లోపల ప్రయాణికులను తీసుకుని వచ్చే వాహనాలు వీలైనంత వేగంగా బయటకు వెళ్లేలా చూడాలని ఆర్పీఎఫ్ పోలీసులకు సూచించారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రాంతం లో సాఫీ ప్రయాణం, మెరుగైన ఫలితాలు ఉంటాయో ఆలోచించాలని ఆయన అధికారులను కోరారు.




