నాలుగు ఏళ్ల క్రితం చోరికి గురైన ద్విచక్ర వాహనంపై
రూ 22,000 వేల రూపాయల ట్రాఫిక్ చాలన్ కట్టాలని పోలీసుల నోటీసులు రావడం తో వాహన యజమాని కంగు తిన్న పరిస్తితి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి.
బోయిన్ పల్లి ప్రాంతానికి చెందిన వెంకట్ రెడ్డి తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం హోండా యాక్టివా (AP10AR 8187) 2020 ఏప్రిల్ మాసంలో చోరికి గురైంది.అన్ని ప్రాంతాల్లో వెతికినా ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో బాధితుడు వెంకటరెడ్డి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. అప్పటికే కొవిడ్ విజృంభణ నేపథ్యం, లాక్ డౌన్ కూడా రావడంతో మిన్న కుండి పోయాడు. అయితే నాలుగు సంవత్సరాల తరువాత బోయిన్ పల్లి ట్రాఫిక్ పోలీసుల నుండి నోటీసులు అందడంతో కంగు తిన్నాడు. నోటీసు 66 రోడ్డు ట్రాఫిక్ ఉల్లంఘనలకు గాను, రూ 22వేల చెల్లించాలని అందులో పేర్కొన్నట్లు బాధితుడు తెలిపారు. ఆ వాహనం విలువనే 10వేలు ఉండదని అన్నారు. బాధితుడు బోయిన్ పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులను ఆశ్రయించి మరొక్క సారి పిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు. ట్రాఫిక్ చల్లాన్ ఆధారంగా ఆన్ లైన్ లో పరిశీలించగా ఎక్కువగా ఓల్డ్ సిటీ లోనే ఉల్లంఘనలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ద్విచక్రవాహనంపైన ఒక టీవీ ఛానల్ స్టిక్కర్ తగిలించుకొని యదేచ్ఛగా తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.
