హైదరాబాద్ నగరంలో గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు , నాలా పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. బేగంపేట డివిజన్ పరిధి లోని అల్లం తోట బాయి శ్రీ నిలయా అపార్ట్ మెంట్ వద్ద మ్యాన్ హోల్ మూతలు పగిలి పోయి ప్ర మాదకరంగా మారాయి. ఈ ప్రాంతం లో ఆద మరిచి నడిస్తే అంతే సంగతులు అని స్థానికులు ఆరోపిస్తున్నారు .కూకట్పల్లి నాల పరివాహక ప్రాంతాలైన ఓల్డ్ కస్టమ్స్ బస్తి, వడ్డెర బస్తీ, బ్రాహ్మణవాడి ,మాతాజీ నగర్, అల్లం తోటబాయి, ప్రకాశం నగర్ ఎక్స్టెన్షన్ ,ప్రకాశం నగర్, చికోటి గార్డెన్ తదితర బస్తీల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచి పోయింది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారింది. జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ పరిధిలో ఉన్న మ్యాన్ హోల్స్ మూతలను తెరచి ఉంచొద్దని, వర్షపు నీరు నిలిచిపోయే ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ కాటా ఆమ్రపాలి ఆదేశించారు. అయితే కిందిస్థాయి సిబ్బంది మాత్రం తమ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ పగిలిపోయి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ వాటికి కొత్త మూతలను ఏర్పాటు చేయలేదు. బేగంపేట అల్లం తోట బాయిలో కొన్ని ప్రాంతాల్లో పగిలిపోయిన మ్యాన్ హోల్స్ కు కొత్తమూతలు ఏర్పాటు చేయకుండా దానికి రాళ్లను అడ్డుగా పెట్టి ఇబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై స్థానికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అల్లం తోట బాయిలో మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోవడంలేదని స్థానికురాలు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు బేగంపేట డివిజన్ పరిధిలో పగిలిపోయిన మ్యాన్ హోల్స్ మూతలను వెంటనే మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

