హిందూ సంప్రదాయంలో గణపతి కి ప్రత్యేకమైన ఉన్నత స్థానం, ప్రథమ స్థానం ఉన్నదని, గణపతిని పూజించడానికి ప్రకృతిలో లభ్యమయ్యే 21 రకాల (పత్రి) దూర్వాలను ఉపయోగించడం, స్వామి వారి మూర్తిని సైతం మట్టితో తయారుచేసి పూజించడం ఒక ఆధ్యాత్మికత భావనే కాకుండా మన ప్రకృతిని మనం పూజించడంతో సమానమని తెలిపారు. అంతేకాకుండా 21 రకాల ఆయుర్వేద లక్షణాలను కలిగిన ఆకులతో పూజించి తదుపరి స్వామివారిని దగ్గరలో ఉన్న బావులు, కాలువల్లో నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతి పరంగా వాతావరణంలో మార్పు వేసవి నుండి వర్షాకాలానికి మారడం తద్వారా వచ్చే రకరకాల రుగ్మతలను కలిగించే బ్యాక్టీరియా వైరస్ లను నీటి ద్వారా దరిచేరకుండా ఈ దూర్వాలు మానవాళిని రక్షిస్తాయని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు, ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్స్ పూర్వ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ మరియు ఒంగోలు ఎయిమ్స్ క్లబ్స్ శాఖల ఆధ్వర్యంలో బొమ్మిశెట్టి వారి అక్షయ జ్యువెలర్స్ అధినేత బొమ్మిశెట్టి కౌశిక్ సహకారంతో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద మృత్తిక (మట్టి) వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితముగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాధా రమణ మాట్లాడుతూ “పండుగ చేసుకుందాం – పరమాత్ముని ఆశీస్సులు పొందుదాం” అన్న నినాదంతో వినాయక చవితి పండుగకు మట్టి ప్రతిమలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి రక్షణర్ధం, పర్యావరణహితార్ధం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు అవగాహన కలిగిస్తూ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పంపిణీ కార్యక్రమంలో ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు ప్రతినిధులు తుమ్మపూడి బుచ్చిబాబు, తుమ్మపూడి ఏడుకొండలు, శెనగేపల్లి నాగాంజనేయులు, తీగల సత్యవతి, బి విజయ రావు, గుర్రం కృష్ణ, డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మ, శ్రీగిరి ప్రదక్షణ కమిటీ సభ్యులు నేరెళ్ల శ్రీనివాసరావు, దనిశెట్టి రాము నాయుడు, సామి రాఘవేంద్రరావు, బొమ్మిశెట్టి జ్యువెలర్స్ బొమ్మిశెట్టి కౌశిక్, కళ, రాచపూడి పవన్ విష్ణు, అక్షయ తదితరులు పాల్గొన్నారు.





