జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్య కర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానెళ్ల విలేకర్లపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అసలు కంటే కొసరు ఎక్కువయిండ్రని, రకరకాల ట్యూబ్‌లంటూ విలేకర్లమంటూ ఎవడు పడితే వాడు జర్నలిస్టులు అంటున్నారని ఏమన్నాంటే జర్నలిస్టులపై దాడి అంటున్నారని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.అయితే సీఎం రేవంత్ ఎవరిని ఉద్దేశించి, ఎవరి ప్రొద్భలంతో ఈ మాటలు అన్నారో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.సీఎం రేవంత్ దృష్టిలో జర్నలిస్టులంటే ఎవరు? జర్నలిజం అంటే ఎలా ఉండాలి? జర్నలిస్టులు కావడానికి ఏం విద్యార్హతలు ఉండాలి? అనే ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా ఈనాడు,ఆంధ్రజ్యోతి, సాక్షి ఇంకా మరికొన్ని కార్పోరేట్ మీడియాలా? అనే ప్రశ్న వేయాల్సి ఉంటుంది.అసలు కంటే కొసరు అంటే రేవంత్ దృష్టిలో ఆంధ్రజ్యోతి,ఈనాడు,సాక్షి లేక ఇంకా కొన్ని మీడియాలు తప్ప మరో మీడియా ఉండకూడదనా? లేక అందులో పనిచేసే వారే జర్నలిస్టులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.కొందరు జర్నలిస్టులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని రేవంత్ భహిరంగంగా చెప్పడంలో నిజం నూటికి నూరుశాతం ఉన్నది.మరి రేవంత్ ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉండి ఇలాంటి సంస్థల్లో పనిచేసే వారిని జర్నలిస్టులు కాదని అలాంటి మీడియాలు మీడియాలు కాదని, అలాంటి మీడియాలకు అన్ని ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తామని,అలాంటి మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వమని చెప్పే ధైర్యం, చిత్తశుద్ధి ఉన్నదా? అని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న మీడియాల్లో అగ్రశ్రేణి మీడియాలుగా చెప్పుకుంటున్న వాటిలో దాదాపు అన్ని పార్టీ మీడియాలే.ఆంధ్రజ్యోతి,ఈనాడు తెలుగుదేశం మీడియాలే.సాక్షి వైసీపీ పార్టీ మీడియా,నమస్తే తెలంగాణ బీఆర్‌ఎస్ మీడియా,నవ తెలంగాణ సీపీఎం,ప్రజాపక్షం సీపీఐ, వెలుగు కాంగ్రెస్ మీడియాలే. ఇందులో ఎలాంటి సందేహం లేదు.మరి ఇలాంటి మీడియాలు పార్టీ మీడియాలైనప్పుడు అలాంటి మీడియాల్లో పనిచేసే విలేకర్లు పార్టీ కార్యకర్తలే కదా? మరి ఆదివారం నాడు చేపట్టిన ఇండ్ల జాగల పంపిణీలో ఇలాంటి పార్టీ కార్యకర్తల జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? పార్టీ మీడియాలు కాని జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా? అంతెందుకు ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు మీ స్థాయిని మరచి పార్టీ మీడియాగా ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయానికి మీరే వెళ్ళి ఆ మీడియా ఎండి దగ్గర చేతులు కట్టుకుని కూర్చోవడం నిజం కాదా?.ఇది ఇలా ఉంటే ఎక్కడో మామూలు రాజకీయ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదగడం వెనక ఈ యూట్యూబ్ ఛానెళ్లు, కొన్ని చిన్న మీడియాలే కారణం.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది యూట్యూబ్ జర్నలిస్టులు కేసులను,జైళ్ల గడపలను ముద్దాడిన విషయం గమనించాలి.అలాంటివారంతా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటడం మూలంగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం రేవంత్ రెడ్డి గమనించాలి.అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లు ఉండగా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు? మరి అసలు కంటే కొసరు ఎక్కువయిండ్రని యూట్యూబ్ జర్నలిస్టులను హేళనగా మాట్లాడటం సరిఅయిన విధానం కాదు. వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే.ఇందులో ఎలాంటి వివక్ష ఉండరాదు.అది మరచి జర్నలిస్టుల మూలాలనే ప్రశ్నించడం రేవంత్ అవివేకమే.అసలు జర్నలిస్టులు ఎవరు? ఎలా ఉండాలి? ఏం చదువుకోవాలి? అని నిర్వచించడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి హక్కులేదు.నీతిని వీడకుండా నిజాన్ని కప్పిపుచ్చకుండా స్వామి సేవ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రజాహితంగా పనిచేసే వారంతా జర్నలిస్టులే.ఇందుకు చదువు ఉండాల్సిన పనిలేదు.ప్రజాసమస్యలను గుర్తించి తన కలంతో అలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే సామాజిక బాధ్యత ఉంటే సరిపోతుంది.అంతే తప్ప మీ దృష్టిలో పెద్ద మీడియాలుగా చెప్పుకుంటున్నవారంతా చేస్తున్నదేంటి? రోజుల తరబడి ఆ ఎమ్మెల్యే రాసలీలు, ఈ ప్రజాప్రతినిధి గొప్పలు..ఇవే కదా? మీరు మెచ్చి మీరే స్వయంగా సాగిలపడి స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చే మీడియాల జర్నలిజం.పార్టీ పత్రికల్లో పనిచేయలేక, జర్నలిజాన్ని అమ్ముకోలేక, పాత్రికేయ వృత్తి మీద మమకారం చంపుకోలేక ఎంతో మంది నిఖార్సయిన జర్నలిస్టులు స్వంతంగా చిన్న చిన్న మీడియాలు, యూట్యూబ్‌లు నడుపుకుంటుంటే అక్రిడేషన్ల పేరు చెప్పి వారందరిని జర్నలిస్టులు కాదంటూ చిన్నచూపు చూడటం ఏ రాజకీయ నాయకుడుకి తగదు.అంతెందుకు మీడియాలను పార్టీ మీడియాలుగా మార్చింది రాజకీయ నేతలే కదా? తమకు అనుకూలంగా ఊడిగం చేయండంటూ కోట్లాది రూపాయలను కొన్ని మీడియాలకు ధారాదత్తం చేసి పార్టీల మీడియాలుగా చేసింది మీ రాజకీయ నేతలు కాదా? గత ప్రభుత్వం చేసింది అదే..ఇప్పుడు మీరు చేస్తున్నది అదే.ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కొమ్ముకాసిన మీడియాలున్నట్లే నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న మీడియాలున్నాయి.ఇవన్నీ అగ్రశ్రేణి మీడియాలే.గమ్మత్తయిన విషయం ఏంటేంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలన్నీ ఆయనకు కొమ్ముకాస్తున్న మీడియాలో కాదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది.దేశ జనాభా పెరిగింది.సమస్యలు పెరిగాయి.పత్రికలు,మీడియాలు పెరుగుతున్నాయి.జర్నలిస్టులు పెరుగుతున్నారు.ఎళ్లకాలం అవే నాలుగు మీడియాలు..నలుగురు జర్నలిస్టులు ఉండాలి అనుకుంటే ఎలా? కోట్లాది ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తేనే ప్రభుత్వాలు చక్కగా పనిచేయగలవు.అంతే తప్ప మాకు నచ్చిన మీడియాలు,జర్నలిస్టులు మాత్రమే ఉండాలి..వారు మాత్రమే జర్నలిస్టులు మిగతా వారంతా నకిలీలు అంటే అంతకన్నా మూర్కత్వం లేదు.అలాంటి ఆలోచనా ధోరణి ఉన్న రాజకీయ నేతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు.మరి రేవంత్ కూడా అదే ఆలోచనా ధోరణిలో ఉంటే అది ఆయన ఇష్టం.కానీ ఎవరు జర్నలిస్టులో ఎవరు జర్నలిస్టులు కాదో గుర్తించడానికి ఓ పెద్ద శాస్త్రవేత్త అవసరం లేదు.ప్రజాసమస్యలే ప్రధాన అజెండాగా ఉన్నవారంతా జర్నలిస్టులే.అలాంటి వారికి అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులే.ఈ విషయం మరచి తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారాంటూ జర్నలిస్టులను అవహేళన చేయడం తగదు.గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులను చిన్న చూపు చూసి ఫలితాన్ని అనుభవించింది. ఇప్పుడు రేవంత్ కూడా అదే తోవలో నడవడం హర్షించదగ్గ పరిణామం కాదు.
*యరమల కిషోర్ రెడ్డి*
డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
944 0 39 35 38
903 0 39 35 38