ఆంధ్రప్రదేశ్ ఎంఎడ్ ప్రోస్పెర్టీ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) చే ఒంగోలు కు చెందిన డాక్టర్ పసుపులేటి పాపారావు “రాష్ట్ర ఉత్తమ ఎడ్యుకేటర్” అవార్డ్ అందుకున్నారు. విజయవాడలోని వైవి. రావు సిద్దార్థ బిఎడ్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరీక్షల సంచాలకులు డి. దేవానందరెడ్డి, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యా విభాగం డీన్ ప్రొఫెసర్ టి. స్వరూపరాణి చేతుల మీదుగా పాపారావు అవార్డును అందుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా విద్యా విభాగంలో, సైకాలజీ రంగంలో డాక్టర్ పసుపులేటి చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు ను పసుపులేటి కి అందించినట్టు నిర్వహకులు తెలిపారు. మరి ముఖ్యంగా ఎందరో విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతమని నిర్వహకులు ఈ సందర్భంగా పసుపులేటిని కొనియాడారు. సైకాలజీ రంగంలో పసుపులేటి కృషి ఆమోఘమని, ప్రభుత్వ పాఠశాల, హాస్టల్ విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడి నిర్వహణ, సరైన అధ్యయన పద్ధతుల గురించి పసుపులేటి చాలా తరగతులు నిర్వహించారని, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో పలు కధనాలు వ్రాస్తూ అటు మనోవిజ్ఞానవేత్తగా, విద్యావేత్త గా డాక్టర్ పసుపులేటి చేసిన కృషిని నిర్వాహకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఉత్తమ ఎడ్యుకేటర్ అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. తనకు విద్యా, మనోవైజ్ఞానిక రంగాలు రెండు కళ్ళ వంటివని, ఆ రంగాల అభివృద్ధి కి రాబోయే కాలంలో మరింత కృషి చేస్తానని తెలిపారు. అవార్డ్ అందుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ పసుపులేటి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ పసుపులేటి పాపారావును అభినందించారు.
