గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించే తమకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 85 ద్వారా ఉరితాడు బిగించిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జీవో 85ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీహెచ్సీల్లో సేవలు అందించే ఎంబీబీఎస్ వైద్యులకు పీజీ వైద్య విద్య ఇన్సర్వీస్ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం విజయవాడలో వైద్యులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్, వివిధ సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. వైద్యులు తమ నిరసనను తీవ్రతరం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు సిద్ధమైంది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ బుధవారం వైద్యులతో చర్చిస్తారని మంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఆ మేరకు కమిషనర్ హరికిరణ్.. వైద్యుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించారు.
