సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో 9 మంది ఉద్యోగులకు “ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను అందజేశారు. తమ విధి నిర్వహణలో చురుకుదనం, అంకితభావాన్ని మరియుఅసురక్షితమైన పరిస్థితులను నివారించే సిబ్బందికి “ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” అవార్డులు అందజేశారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, గుంతకల్ , గుంటూరు మరియు నాందేడ్ మొత్తం ఆరు డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
అరుణ్ కుమార్ జైన్ జోన్ మాట్లాడుతూ వివిధ డివిజన్ లకు చెందిన 9 మంది ఉద్యోగులకు విధి నిర్వహణలో అప్రమత్తతను ప్రదర్శించినందుకు మరియు అసురక్షిత పరిస్థితులను నివారించడానికి సకాలంలో చర్యలు చేపట్టినందుకు : సికింద్రాబాద్ డివిజన్ – 02 , విజయవాడ డివిజన్ -03 , గుంతకల్లు డివిజన్ -03 మరియు హైదరాబాద్ డివిజన్ -01 “ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్” భద్రతా అవార్డులను అందజేశారు. ఈ అవార్డు గ్రహీతలలో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు మరియు టెక్నీషియన్లు మొదలైన వివిధ వర్గాలకు చెందినవారు ఉన్నారు. ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతల విధుల నిర్వహణలో వారి చిత్తశుద్ధి మరియు నిబద్ధతకు అభినందించారు. ఈ అవార్డులు భద్రతా విధానాలను అనుసరించడంలో ఇతర ఉద్యోగులను ప్రేరేపిస్తాయని, అలాగే రైళ్లను సురక్షితంగా నడిపేందుకు రైల్వేలకు కుడా ఎంతో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
అనంతరం అరుణ్ కుమార్ జైన్, భద్రతా అంశాలను సమీక్షిస్తూ, భద్రత మన ప్రధాన లక్ష్యం ఇది అన్ని వేళలా పాటించబడాలని , విధులను నిర్వర్తించేటప్పుడు ఎటువంటి సత్వర పద్దతులను అవలంబించరాదని పేర్కొన్నారు. రైళ్ల రాకపోకల్లో భద్రత ఉండేలా భద్రతా విధానాలను కచ్చితంగా పాటించాలని సిబ్బంది మరియు అధికారులకు సూచించారు. అన్ని స్థాయిలలో అన్ని అంశాలలో ముందస్తు భద్రతా చర్యలను పాటించాలని ఆయన పేర్కొన్నారు.
జనరల్ మేనేజర్ సేఫ్టీ డ్రైవ్‌లలో భాగంగా తరచుగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని మరియు లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులు మరియు ఆర్పిఎఫ్ సిబ్బంది మొదలైన వారితో సహా భద్రతా సంబంధిత సిబ్బందికి భద్రతా విధానాలను ఖచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. భద్రతకు సంబంధించిన అన్ని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రైల్వేసిబ్బంది పని స్థలం నుండి పని పూర్తిచేసి బయలుదేరే ముందు, పాత పట్టాలు, కేబుల్స్ మొదలైన వ్యర్ధ సామగ్రి ట్రాక్‌ల దగ్గర వదిలివేయకుండా వాటిని సరియైన స్థలంలో నిల్వఉంచడం ద్వారా పని ప్రదేశం యొక్క భద్రతను నిర్ధారించాలని సూచించారు.
అనంతరం జోన్ లో కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల స్థితిగతులపై డీఆర్ఎంలతో చర్చించారు. సిగ్నల్, ఆపరేటింగ్ తదితర అన్ని విభాగాల సమన్వయంతో ట్రాక్ మెషీన్లు మరియు పరికరాలను సద్వినియోగం చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు తద్వారా ప్యాసింజర్ రైళ్ల సమయపాలన మెరుగు పర్చవచ్చని పేర్కొన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌ఫారమ్ ఎత్తు పెంపు, ప్లాట్ ఫారమ్‌లపై కవర్, వెయిటింగ్ హాళ్లు మరియు తాగునీటి సౌకర్యాల ఏర్పాటు మొదలైన ప్రయాణీకుల సౌకర్యాల పనులను సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు

