నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణం వలన కనిగిరి పట్టణ శివారు ప్రాంతమైన శంఖవరంలోని ప్రజలకు, మైనింగ్ కు ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా హామీ ఇచ్చారు. మంగళవారం కనిగిరిలో పర్యటించిన ఆమె, స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి శంఖవరం వెళ్లారు. ఈ రైల్వే లైను నిర్మాణం కోసం ఏడు గృహాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. సంబంధిత ఇళ్ల యజమానులు కూడా తమ పరిస్థితిని కలెక్టరుకు చెప్పారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇళ్లకు నష్టపరిహారం ఇస్తామని, అదేవిధంగా ప్రత్యామ్నాయ నివాస స్థలాలు కూడా చూపుతామని భరోసా ఇచ్చారు. ఈ రైల్వే లైను నిర్మిస్తే సమీపంలోని మైనింగ్ ప్రాంతంలోకి వెళ్లడానికి దారి సమస్య ఎదురవుతుందని సంబంధిత క్వారీల యజమానులు చెప్పగా, ఆ ప్రాంతాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకుంటామని క్వారీల యజమానులకు ఆమె హామీ ఇచ్చారు. ఈ దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కనిగిరి పట్టణంలోనూ, శివారు ప్రాంతంలోనూ అక్రమ కట్టడాలను కూడా కలెక్టరు, ఎమ్మెల్యే పరిశీలించారు. అక్రమ కట్టడాలు నిర్మించిన స్థల స్వభావాలను అధికారులు ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ వాటిని స్వాధీనం చేసుకోవడానికి నిబంధనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కనిగిరిలో గతంలో అక్రమంగా స్వభావం మార్చిన 60 ఎకరాలను తిరిగి ప్రభుత్వ భూములుగా మార్చినట్లు ఆర్డీవో జాన్ ఇర్విన్ చెప్పగా, ఆయా స్థలాలలో స్థానిక అవసరాలకు తగినట్లుగా కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టరు వెంట స్థానిక తహసిల్దార్ అశోక్, ఇతర అధికారులు ఉన్నారు.



