వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ విషయంలో దాతలు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వానికి తోడుగా నిలవడం హర్షణీయమని ఆమె అన్నారు. మంగళవారం కనిగిరిలో పర్యటించిన కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు ముక్కు.ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. శాసనసభ్యులు తన సొంత నిధులతో ఈ ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డును అభివృద్ధి చేస్తున్న తీరును ఆమె పరిశీలించారు. నవజాత శిశువులకు అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న యంత్రాలను ఆమె తిలకించారు. ఇందుకోసం ఇప్పటివరకు 11 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. స్వతహాగా డాక్టరు అయిన ఉగ్ర నరసింహారెడ్డి… తల్లీ బిడ్డల ఆరోగ్య సురక్ష విధానాన్ని అమలులోకి తెచ్చి అప్పుడే ప్రసవించిన తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో రాష్ట్రంలోనే ఉత్తమ సామాజిక ఆరోగ్య కేంద్రంగా కనిగిరి సి.హెచ్.సీ. ని నిలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా, ఆసుపత్రి అభివృద్ధి కోసం తనవంతుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డా వెంకట సుబ్బారెడ్డి ఈ సందర్భంగా రెండు లక్షల రూపాయల చెక్కును కలెక్టరుకు అందించారు.
తన బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా సహజ సిద్ధమైన పౌచ్ (సంచి)లో దాచి ప్రాణాలు కాపాడే జీవి… కంగారు. ఇదే విధానాన్ని అమలు చేయడం ద్వారా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు, బరువు తక్కువగా పుట్టిన శిశువులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా చూడాలన్న ఆలోచనతోనే ‘ కంగారు ‘ మోడల్ ను అమలు చేస్తున్నట్లు శాసనసభ్యులు తెలిపారు. అప్పటివరకు కడుపులో ఉండి ఈ లోకంలోకి వచ్చిన బిడ్డకీ, తల్లికీ ఇప్పుడు కూడా పరస్పరం శారీరక సంబంధం ఉండేలాగా బిడ్డను తన ఛాతి పైన సాధ్యమైనంత ఎక్కువ సమయం పడుకోపెట్టుకోవడం ద్వారా వెచ్చదనాన్ని, ప్రేమను తల్లి పంచడం, సరైన విధానంలో పాలు పట్టడం, పోషణ, శుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ఈ విధానం లక్ష్యమని ఆయన చెప్పారు.
అనంతరం ఆసుపత్రిలోని వివిధ వార్డులను కలెక్టర్ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యులు అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట స్థానిక ఆర్డిఓ జాన్ ఇర్విన్, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ , ఇతర అధికారులు ఉన్నారు.




