ఎర్రగొండపాలెం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హేమలత సస్పెండ్ అయ్యారు. స్థానికంగా ఓ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఆమె వ్యవహరించారంటూ ‘ భూమి లేకపోతేనేం.. రిజిస్ట్రేషన్ చేస్తాం! ‘ అనే శీర్షికతో బుధవారం ఒక దినపత్రికలో వార్తా కథనం వచ్చింది. దీనిపై విచారణ జరిపి వాస్తవ నివేదికను ఇవ్వాలని జిల్లా రిజిస్ట్రార్ .ఏ.బాలాంజనేయులును కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. పత్రికా కథనం వాస్తవమేనని, ప్రభుత్వ రికార్డులలో లేని సర్వే నంబరు(557-3)తో సదరు భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ నిర్ధారించి కలెక్టరుకు నివేదిక సమర్పించారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని కలెక్టర్ స్పష్టం చేయడంతో ఈ నివేదికను ఆధారంగా చేసుకుని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హేమలతను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల శాఖ డి.ఐ.జి. పుష్పలత బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం హేమలత పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎర్రగొండపాలెం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హేమలత సస్పెండ్
25
Sep