విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర సాంఘీక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం ఒంగోలులోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన బధిరుల సంకేత భాషా దినోత్సవ వేడుకలు మరియు జాతీయ దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా ఎంపిక చేయబడిన లబ్దిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి డా. శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన హెలెన్ కెల్లర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 50 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎన్.హెచ్.ఎఫ్.డి.సి కింద కోటి 46 లక్షల 50 వేల రూపాయల విలువ చెక్కులను మంత్రి అందచేసారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బధిరుల సంకేత భాషా దినోత్సవ వేడుకలను బధిరుల ఆశ్రమ పాఠశాలలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి, వారి భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి జీవనప్రమాణాలు, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. గత 40 సంవత్సరాల క్రితమే బధిరుల కోసం దూరదర్సన్ లో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం అయ్యేవని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడల్లో ప్రోత్సహించేలా, వారి ప్రతిభాపాటవాలను వెలికి తీసేందుకు రాష్ట్రంలో విభిన్నప్రతిభావంతుల కోసం విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయలతో 30 ఎకరాల్లో జాతీయ విభిన్న ప్రతిభావంతుల క్రీడల ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బధిరులకు 10వ తరగతి వరకు చదువుకోవడానికి ఒంగోలు లో బధిరుల పాఠశాల వుందని, అలాగే ఇంటర్మీడియట్ చదువుకోవడానికి బాపట్లలో జూనియర్ కళాశాల వుందని, బధిరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన కాళ్ళపై తాను నిలబడి జీవించేలా ప్రతిఒక్కరు చదువుకోవాలని ఈ సందర్భంగా మంత్రి, బధిరులను కోరారు. బధిరుల విద్యార్ధులు ఎక్కువగా వుంటే అందుకనుగుణంగా అధ్యాపకులను నియమించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమంలో బధిరుల సమస్యలు అధికారుల దృష్టికి సులువుగా తీసుకెళ్ళడానికి కలెక్టరేట్ లోనూ మరియు ఎస్.పి కార్యాలయంలో ఒక అనువాదకులను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ పద్దతి రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం జరుగుచున్నదన్నారు. ఈ రోజు 50 మంది విభిన్న ప్రతిభావంతులకు ఒక కోటి 46 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కులను అందచేయడం జరిగిందని, అందులో ప్రభుత్వ వాటాగా ఒక కోటి 39 లక్షల 30 వేల రూపాయలు కాగా, లబ్దిదారుల వాటాగా 7 లక్షల 20 వేల రూపాయలని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మూగ వారి కోసం టచ్ ఫోన్లు, అంధత్వం కలిగిన వారి కోసం సెన్సార్ స్టిక్ లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాటశాలల్లో చదువుకొంటున్న బధిరులకు సంబంధించిన పెన్షన్ ను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం, మద్దిరాల పాడు గ్రామంలో పర్యటించి నప్పుడు కల్లు గీత కార్మికుడు ఆల్లుదాసు శ్రీను పక్కా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నానని ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటే కేవలం 5 రోజుల్లోనే ఇంటి నివేశన స్థల పట్టాను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుందన్నారు. అలాగే నాగులుప్పలపాడు గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతులు సురేష్ నాకు వీల్ చైర్ కావాలని ముఖ్యమంత్రి గారిని కోరితే, కేవలం 5 రోజుల్లోనే 95 వేల రూపాయల విలువ గల ఎలక్ట్రికల్ మూడు చక్రాల వాహనాన్ని ఈ రోజు అందచేయడం రాష్ట్రం ప్రభుత్వానికి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం పట్ల వున్న శ్రద్ద, నిబద్దతకు నిదర్శనమన్నారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, బధిరుల సంకేత భాషా దినోత్సవ వేడుకల సందర్భంగా బధిరులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు 50 మంది విభిన్న ప్రతిభావంతులకు ఒక కోటి 46 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కులను అందచేయడం జరిగిందని, ఈ ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని సమాజంలో మేము ఎవరికీ తీసిపోము అని నిరూపిస్తూ జీవితంలో ముందుకు పోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా లబ్దిదారులకు సూచించారు. అలాగే విభిన్నప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి హామీని అమలు చేసిన అధికారులు, సంతోషం వ్యక్తం చేసిన లబ్దిదారులు శ్రీ సురేష్ :
…………………………..
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈనెల 20న నాగులుప్పలపాడు మండలం, మద్దిరాలపాడు గ్రామానికి వచ్చినప్పుడు నేను వికలాంగున్ని, నాకు తిరిగేందుకు ఎలక్ట్రికల్ వాహనం కావాలి అని ముఖ్యమంత్రి ని కోరిన సందర్భంగా, నా అభ్యర్ధనను ముఖ్యమంత్రి గారు విని ఆరోజు నాకు హామీ ఇవ్వడం జరిగింది. కేవలం 5 రోజుల్లోనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు 95 వేల రూపాయల విలువ గల ఎలక్ట్రికల్ వాహనాన్ని మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా ఎలక్ట్రికల్ వాహనాన్ని పొందడం ఎంతో సంతోషంగా వుందని, నేను జీవితాంతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు రుణపడి వుంటాని తెలుపుతూ శ్రీ సురేష్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్ధిఒ సుబ్బారెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీ లక్ష్మా నాయక్, చీమకుర్తి బధిరుల పాఠశాల కరస్పాండెంటు అంజిరెడ్డి, బధిరుల జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీ రాజేంద్ర, ఒంగోలు బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్ధులు, ఎన్.హెచ్.ఎఫ్.డి.సి లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

