క్రోధి నామ సంవత్సరం, అక్టోబరు 3వ తేదీ, గురువారం మొదలు అక్టోబరు 12వ తేది, శనివారం వరకు ఒంగోలు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ తదియారాధన సంఘం ప్రతినిధులు మరియు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చుండూరి శ్రీనివాసులు, పచ్చిపులుసు అనిల్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త సహితంగా నవరసాభిషేకలు, 10.30గం.లకు అలంకరణ, సహస్రనామార్చన, మంత్రపుష్పము, తదుపరి తీర్థప్రసాదాలు వితరణ జరుగునని, సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక భజన కార్యక్రమాలు, 8:30 గం.లకు శ్రీ వాసవి కోలాట భజన మండలి వారి కోలాటం, గుడి ఉత్సవం, మంత్రపుష్పం కార్యక్రమాలు జరుగునని తెలిపారు. ఈ సందర్భంగా తదియారాధన సంఘ ప్రతినిధులు, వాసవి కోలాట భజన మండలి సభ్యులు శరన్నవరాత్రుల కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ప్రతిరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక అలంకరణలో భాగంగా 3వ తేదీ గురువారం బాల త్రిపుర సుందరీ దేవిగా, 4వ తేదీ శుక్రవారం గాయత్రీ దేవిగా, 5వ తేదీ శనివారం కాశీ అన్నపూర్ణాదేవిగా, 6వ తేదీ ఆదివారం లలితా త్రిపుర సుందరీ దేవిగా, 7వ తేదీ సోమవారం వాసవి మాతగా, 8వ తేదీ మంగళవారం మహాలక్ష్మి దేవిగా 9వ తేదీ బుధవారం సరస్వతీ దేవిగా, 10వ తేదీ గురువారం దుర్గాష్టమి పర్వదినాన విజయదుర్గాదేవిగా 11వ తేదీ శుక్రవారం మహర్నవమి పర్వదినం సందర్భంగా మహిషాసుర మర్దినిగా, 12వ తేదీ శనివారం విజయదశమిని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారని, కార్యక్రమాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ తదియారాధన సంఘం నిర్వహణలో జరుగునని తెలిపారు. కావున భక్తులందరూ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని ఆలయంలో జరుగుతున్న విశేష కార్యక్రమాలను తిలకించి, శ్రీవాసవి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు.

