అక్టోబర్ నెల 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచే ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి. ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీపై శనివారం ప్రకాశం భవనం నుంచి డి.ఎల్.డి.ఓ.లు, అన్ని మండలాల ఎం.పి.డి.ఓ.లు, మండల స్పెషల్ ఆఫీసర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబరు 2వతేదీ మహాత్మా గాంధీజీ జయంతి అయినందున ప్రభుత్వ సెలవు దినము కావున 1వతేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2, 88,144 పెన్షనర్లు ఉన్నందున వీరికోసం రూ.122.64 కోట్లను ఈ నెల 30వ తేదీనే బ్యాంకుల నుండి విత్ డ్రా చేసుకోవాలని ఆమె చెప్పారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఎం.పి.డి.ఓ.ల కార్యాలయాలలో కంట్రోల్ రూము ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్వర్ణాంధ్ర 2047 పై ప్రభుత్వం దృష్టి సారించినందున ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలో ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటున్నందున ఆది, సోమవారాలలో ఈ సర్వే విస్తృత స్థాయిలో చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని ఉద్యోగులందరూ కచ్చితంగా తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూడాలన్నారు. అలాగే ప్రతి సచివాలయ ఉద్యోగితో కనీసం 100 మందిని సర్వే చేయించాలని అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
సమావేశంలో డి.ఆర్.డి.ఏ. పి.డి. వసుంధర, జడ్.పి. సి.ఈ.ఓ. బి.చిరంజీవి, ఎల్.డి.ఎం.డి.రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

