జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం స్థానిక మామిడిపాలెంలోని ఈ.వి.ఎం.గోదాములను సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా వివిధ రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల షట్టర్లు తెరిచి అందులోని ఈ.వి.ఎం.లను పరిశీలించారు. వాటి స్థితిగతులను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంగణంలో కల్పిస్తున్న భద్రతపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు కాలేషా(టి.డి.పి.), జి.సత్యనారాయణ (బిజె.పి.), క్రాంతికుమార్ (వై.సి.పి.), రసూల్ (కాంగ్రెస్), జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.
త్వరగా ఫ్రీ హోల్డింగ్ వెరిఫికేషన్
భూముల ఫ్రీ హోల్డింగ్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ అంశం పై సి.సి.ఎల్.ఏ. జయలక్ష్మి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఇందులో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్రీ హోల్డింగ్ కు సంబంధించి జిల్లాలోని పరిస్థితిని వివరించారు. పరిశీలన కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.


