కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ మంగళవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాటాను కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అన్ని డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా
నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్ల తో కలిసి సమస్యలపై వినతి పత్రాలను కమీషనర్ కు అందజేశారు…
కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి, జేఎన్టీయూ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు సత్వరం ప్రాజెక్ట్ విభాగం అధ్వర్యంలో అండర్ పాస్ నిర్మాణ పనులు చేపట్టాలనీ కోరారు. వసంతనగర్ నుంచి గోకుల్ మీదుగా హైటెక్ సిటీ కీ వెళ్లేదారిలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, మూసపేట ఆంజనేయనగర్ నుంచి కైత్లాపూర్ వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూకట్పల్లి నియోజకవర్గంలో చాలావరకు ట్రాఫిక్ సమస్యలు పూర్తి అయ్యాయని, మిగతా చోట్ల కూడా పనులకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వాటిని కూడా ప్రయారిటీ బేసిస్ లో చేపట్టి పూర్తి చేయాలన్నారు. జేఎన్టీయూ , గోద్రేజ్ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా నెలకొందని ఈ రెండు చోట్ల గత ప్రభుత్వం ఆమోదం తెలిపిన పనులకు నిధుల మంజూరు చేసి పనులు చేపట్టాలనీ కోరారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని అసలే వర్షాకాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సనత్నగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులు త్వరగా మొదలు పెట్టాలన్నారు. రైల్వే అండర్ పాస్ పనులు కూడా మొదలు పెట్టి పూర్తి చేయాలనీ కోరారు. బాలానగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టాలనీ, బాలాజీనగర్ నగర్ డివిజన్ లో అనేక చోట్ల స్ట్రాం వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ వర్క్ స్టార్ట్ చేసి పెండింగ్ పెట్టారనీ,వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. అల్లాపూర్ డివిజన్ లో పెండింగ్ సమస్యలు గత ప్రభుత్వంలో మంజూరైన పనులు ఇంకా మొదలు కాకపోవడంపై దృష్టి పెట్టాలని, పేదల బస్తీలో ఇంటినెంబర్స్ కేటాయింపు చేయాలన్నారు. ఓల్డ్ బోయినపల్లి లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇచ్చి త్వరగా పూర్తి చేయాలన్నారు.
మూసాపేట మెయిన్ రోడ్డు నుంచి సర్కిల్ కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు సగం పూర్తి చేసి మిగతాది పెండింగ్ ఉంది .దాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్ల తో మాట్లాడిన కమిషనర్ సమస్యలను పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్స్ కు డిసెంబర్ వరకు పేమెంట్స్ పూర్తి అయ్యాయన్నారు. డివిజన్లలో జరిగే పనుల విషయంలో నాణ్యత విషయమై కార్పోరేటర్స్ దృష్టి పెట్టాలని కమిషనర్ అమ్రపాలి సూచించారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు జీ హెచ్ ఎం సి కమీషనర్ ను కలిసిన వారిలో కూకట్ పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు.టి.మహేశ్వరి శ్రీహరి, ముద్దం నరసింహ యాదవ్, పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, సబేహా గౌసుద్దీన్, మాధవరం రోజా రాణి, పి.శిరీషా, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

